డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి తరిమేయాలి

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది

నషా ముక్త్ భారత్ లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 06: తెలంగాణ రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత సమష్టిగా కృషి చేయాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. 2029 కంటే ముందే రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకు రావాలని సూచించారు.మంగళవారం మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్’ యువజన–విద్యార్థుల ర్యాలీని గవర్నర్ ప్రారంభించారు. కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తదితరులు హాజరై గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన రెడ్‌క్రాస్ సభ్యులతో సమావేశమై పలు అంశాలపై మాట్లాడారు.

మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను 2029 నాటికి మత్తు పదార్థాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గవర్నర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన ‘నషా ముక్త్ భారత్’ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు ఉద్యమంలా ముందుకు సాగాలని కోరారు.మత్తు పదార్థాల నిర్మూలనలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, అయితే ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని అన్నారు. గ్రామస్థాయి నుంచే డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభం కావాలని, ప్రతి యువకుడు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా సంకల్పం తీసుకోవాలని సూచించారు.హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన సమయంలో మీడియా నుంచి మంచి సహకారం లభించిందని గుర్తుచేసుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, తెలంగాణలోనూ మీడియా అదే విధంగా సహకరించి నషా రహిత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు.

అభివృద్ధి చెందుతున్న దేశంలో డ్రగ్స్‌కు బానిసలైన యువత చెడు మార్గంలోకి వెళ్లే ప్రమాదం ఉందని, యువతను కాపాడటం ద్వారా దేశ భవిష్యత్తును కాపాడినట్లవుతుందని గవర్నర్ అన్నారు. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్. జిల్లా అధికారులు. మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News