జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ప్రతిపక్షం, మంథని, మే 17 : ఈవీఎం యంత్రాలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ లను నిరంతరం పర్యవేక్షించాలని పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులకు తెలిపారు. గురువారం ముజమ్మిల్ ఖాన్ రామగిరిలోని సెంటినరీ కాలనీలో ఉన్న జేఎన్టీయూ మంథని కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ ని ఎసీపీ మడత రమేష్, సహాయ రిటర్నింగ్ అధికారులు వి. హనుమా నాయక్, బి. గంగయ్య లతో కలిసి పరిశీలించారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ప్రక్రియ జేఎన్టీయూ రామగిరి కళాశాలలో జరుగుతుందని, ఈ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోలైన ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపర్చామని అన్నారు.
స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ముడు అంచెల పటిష్ట భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామని, అనుమతి లేకుండా ఎవరు లోపలికి వచ్చే వీలు లేదని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ పూర్తి కవరేజతో సీసీ కేమేరాలు ఏర్పాటు చేశామని, వీటి ద్వారా స్ట్రాంగ్ రూమ్ లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. అనంతరం స్ట్రాగ్ రూములకు వేసిన సీల్ లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్ లో సంతకం చేశారు. అదే విధంగా జూన్ 4న జరగబోయే కౌంటింగ్ కి సంబంధించి చేస్తున్న ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, కెమెరా మానిటరింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంథని సీఐ వెనటేశ్వర్లు, రామగిరి ఎస్సై కే. సందీప్ కుమార్, తహసీల్దారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.