చండూరులో అనుమానాస్పద మృతదేహం కలకలం – బైక్ మెకానిక్ శ్రీనుగా గుర్తింపు.

ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 30: నల్గొండ జిల్లా చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామ శివారులో ఓ వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.బుధవారం ఉదయం రోడ్డు పక్కన గడ్డి పొదల్లో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతుడిని కనగల్ మండలం పోనుగోడు గ్రామానికి చెందిన బండమీది శ్రీను (35)గా గుర్తించారు. శ్రీను కూరంపల్లి గ్రామంలో బైక్ మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
*ప్రమాదమా? హత్యా?
మంగళవారం రాత్రి ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే మృతదేహం లభించిన తీరు, పరిసరాల్లో ఉన్న ఆనవాళ్లను బట్టి పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.మృతదేహం లభించిన ప్రదేశంతో పాటు పరిసర ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతుడి మరణానికి గల పూర్తి కారణాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Spread the love

Related News

Latest News