ప్రతిపక్షం, సెప్టెంబర్ 29: తెలంగాణ రాజకీయాల్లో అన్నాచెల్లెళ్ల మధ్య మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కవిత ఘాటుగా స్పందించారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి అన్న విధంగా పార్టీ అధినేత కేసీఆర్ గతంలో చేసిన సూచనలు, ఇతర నాయకులు నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న నిర్ణయాలు పార్టీకి నష్టం చేశాయని కేటీఆర్ పేర్కొన్న నేపథ్యంలో కవిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీకి ఎదురైన నష్టానికి నాయకత్వ నిర్ణయాలను కారణంగా చూపడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. ‘గుంటనక్క మైండ్ గేమ్‌లో పడి పెద్ద మనిషినే తప్పు పడుతున్నావు’ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. పార్టీ వ్యవహారాల్లో జరిగిన పరిణామాలకు తమ చేతగానితనాన్ని అధినేతపై మోపుతున్నారంటూ కవిత ఆరోపించారు.
గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన అంశాన్ని కూడా కవిత ప్రస్తావించారు. నిమజ్జనం సమయంలో డబ్బులు ఇచ్చి కేసీఆర్ పాటలు పెట్టించారనే విషయం తమ అంతరాత్మకు తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తాను ఆధారాలతోనే మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సందర్భాల్లో ఆధారాలతో మాట్లాడతానని కవిత స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే కేటీఆర్‌ను ఉద్దేశించి ‘నాతో పెట్టుకోకు’ అంటూ కవిత హెచ్చరిక ధోరణిలో స్పందించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తన వద్ద సమాధానాలు ఉన్నాయని, వ్యక్తిగతంగా లేదా రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకుంటే తాను కూడా ఆధారాలతో స్పందించాల్సి వస్తుందని ఆమె తన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు.




























