కల్కి భగవాన్ కన్నుమూత

ప్రతిపక్షం, సెప్టెంబర్ 30: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్(77) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గత పది రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు ట్రస్టు ప్రతినిధులు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు.

కల్కి భగవాన్ మృతితో ఆయనను అనుసరించే భక్తులు, ఆధ్యాత్మిక వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన ఆధ్యాత్మిక బోధనలు, ధ్యానం, ఆత్మపరిశీలనకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి పరిచయమయ్యారు. దక్షిణ భారతదేశంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆయనకు అనుచరులు ఉన్నారు.

ఆయన పార్థివదేహాన్ని భక్తుల సందర్శనార్థం తిరుపతి జిల్లాలోని బత్తులవల్లం ఏకం ఆలయంలో ఉంచనున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి భక్తులు, అభిమానులు ఆయనకు తుది నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పించనున్నారు. ఆయనను చివరిసారిగా దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

కల్కి భగవాన్ అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్లు ట్రస్టు వర్గాలు వెల్లడించాయి. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆయన మృతితో ఆధ్యాత్మిక రంగంలో ఒక ప్రముఖ వ్యక్తిని కోల్పోయామని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News