*పారిశుధ్య సిబ్బంది సేవలు అభినందనీయం.
*పారిశుధ్య సిబ్బందికి హెల్త్ క్యాంపు నిర్వహించిన చైర్మన్ కోడి శ్రీనివాసులు.
ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 30:చండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్వచ్ఛత హి సేవ” కార్యక్రమంలో భాగంగా మంగళవారం చండూరు మున్సిపాలిటీలో ప్రత్యేక హెల్త్ క్యాంపును నిర్వహించారు.ఈ రోజు స్థానిక గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో పారిశుధ్య కార్మికులు, వాటర్ సప్లై సిబ్బంది, ఎలక్ట్రీషియన్లకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ… పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఎండ, వర్షం వంటి వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తున్న సిబ్బంది సేవలు అభినందనీయమని తెలిపారు.
“స్వచ్ఛత హి సేవ” కార్యక్రమం ద్వారా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములైన సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన ఆహారం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, పీహెచ్సీ డాక్టర్ ఆశా కిరణ్, మున్సిపల్ మేనేజర్ జి. రాములు, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభారద్వాజ్, వార్డ్ ఆఫీసర్ బి. సాయిరాం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ యమ్. అరవింద్ రెడ్డి, ఏఎన్ఎం మంగమ్మ, ఆశా వర్కర్లు, పారిశుధ్య సిబ్బంది, వాటర్ సప్లై సిబ్బంది, ఎలక్ట్రీషియన్స్, మెప్మా సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




























