కదం తొక్కిన ఇండియా కూటమి అఖిలపక్ష పార్టీలు

  • బీజేపీకి ఓట్లు వేయని వారి ఓట్లను ఫామ్‌–6 పేరుతో తొలగించే హక్కు ఎవరిచ్చారు?
  • ప్రజాస్వామ్యానికి పునాది అయిన వయోజన ఓటు హక్కును కాలరాస్తారా?
  • నియోజకవర్గంలో 45 వేల ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది…
  • సీఈసీ జ్ఞానేశ్వర్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించి.. తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్..
  • ఓట్ల తొలగింపుపై డీసీసీ చీఫ్‌ శివసేన రెడ్డి ధ్వజం..

వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 07, ప్రతిపక్షం: బీజేపీ పార్టీకి ఓట్ల కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నది జ్ఞానేశ్వర్‌ కుమార్ అనే అజ్ఞానేశ్వరుడని డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.జ్ఞానేశ్వర్‌కుమార్‌ను అడ్డం పెట్టుకుని బీజేపీకి ఓట్లు వేయని వారి ఓట్లను ఫామ్‌–6 పేరుతో తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అసలు ప్రజల ఓట్లను తొలగించే అధికారం ఎవరిచ్చారని సీఈసీని నిలదీశారు. దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన అత్యంత కీలకమైన వయోజన ఓటు హక్కును తొలగించడం అంటే ప్రజాస్వామ్యాన్నే తగలబెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి, అఖిలపక్ష పార్టీల మద్దతుతో అంబేద్కర్‌ చౌరస్తాలో భారీ నిరసన, ధర్నా నిర్వహించారు.అనంతరం సీఈసీ జ్ఞానేశ్వర్‌కుమార్‌, బీజేపీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా చీఫ్ శివసేనరెడ్డి మాట్లాడుతూ…ప్రజల ఓటు హక్కును కాపాడే వరకు ఉద్యమం ఆగదని నాయకులతో కలిసి ఆయన స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌కుమార్‌పై చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలంతా గమనిస్తున్నారని శివసేన రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువ తెలియని వారు ఎన్నికల వ్యవస్థకు ఎలా నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు.

దేశద్రోహులు, దేశానికి హాని కలిగించే తీవ్రవాద భావజాలంతో ఉన్నవారి పౌర హక్కులపై చట్టపరమైన చర్యలు ఉండొచ్చని, కానీ బీజేపీని ప్రశ్నించే సాధారణ పౌరుల ఓట్లను తొలగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌- 326 వయోజన ఓటు హక్కుకు హామీ ఇస్తోందని, తొలగించిన ఓట్లను తిరిగి పునరుద్ధరించే వరకు కాంగ్రెస్‌, ఇండియా కూటమి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్ల తొలగింపు అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారి ఓట్లనే లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారన్న ఆరోపణలను ఆయన చేశారు.ఇటీవల ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీలతో కలిసి ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేశారని, అక్రమ అరెస్టులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడు భయపడదని ప్రజల కోసం పోరాడే నైతికత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు.అలాగే బీజేపీకి ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియదని విమర్శించారు. బీజేపీని గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయని, ‘బీజేపీ హటావో.. దేశ్‌ బచావో’ నినాదంతో ఇండియా కూటమి అఖిలపక్షాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.నియోజకవర్గంలో సుమారు 2.75 లక్షల ఓట్లు ఉండగా.. అందులో 45 వేల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని అఖిలపక్ష పార్టీ నాయకులు , శివసేన రెడ్డి ఆరోపించారు. బతికున్న ప్రజల ఓట్లను తొలగించడం, అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఎన్నికల వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులను అడ్డం పెట్టుకుని బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

భారత రాజ్యాంగ పరిరక్షణ, లౌకిక విలువల కాపాడటానికి ఇండియా కూటమిలోని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడుతున్నాయని తెలిపారు. యువత, ముఖ్యంగా జెన్‌–జీ తరానికి ప్రజాస్వామ్య హక్కుల విలువ తెలుసని, వారిని మభ్యపెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందడం ఇక సాధ్యం కాదన్నారు. తదంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి సమీకృత కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ… బిజెపి హటావో దేశ్ బచావో నినాదాలు చేస్తూ పలువురు నాయకులు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికి అఖిలపక్ష పార్టీల నాయకులతో కలిసి పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్టాంజనేయులు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జబ్బర్, సిపిఐ జిల్లా కార్యదర్శి జయరాములు, సిపిఐ కార్యవర్గ సభ్యులు రమేష్, తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా, సిపిఎంఎల్ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, గణేష్, ఎంఐఎం పార్టీ నాయకులు, సమాజ్ వాది పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, పట్టణ అధ్యక్షులు కదిరే రాములు, కౌన్సిలర్లు ధనలక్ష్మి, విజయలక్ష్మి, ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షులు వాల్యనాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కాకుల సతీష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆదిత్య, మైనార్టీ జిల్లా అధ్యక్షులు అయుబ్ ఖాన్, ఎండి బాబా, యూత్ కాంగ్రెస్ నాయకుల శివకుమార్ నాయుడు, పాండు సాగర్, అరవింద నాయక్, వివిధ మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News