’23న సందీప్​ను కలవండి’ : కాంగ్రెస్ హైకమాండ్​ నుంచి రాజగోపాల్​ రెడ్డికి ఫోన్

ప్రతిపక్షం, నవంబర్ 21: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ నెల 23న తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి బి.ఎం. సందీప్‌తో సమావేశం కావాలని హైకమాండ్‌ సూచించినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ ఫోన్‌ కాల్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ క్రమశిక్షణ, నేతల వ్యాఖ్యలు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారాలపై అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

రాజగోపాల్‌రెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పులను ప్రశ్నించడానికి ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం లేదని, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం తన నైజమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సిటీ అభివృద్ధికే సరైన ప్రణాళిక లేకపోతే ఫ్యూచర్‌ సిటీ పేరుతో కొత్త ప్రాజెక్టులు ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ నియోజకవర్గానికి, మంత్రులు తమ తమ ప్రాంతాలకు అధికంగా నిధులు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కొడంగల్‌కు రూ.20 వేల కోట్లు తీసుకెళ్లండి.. కానీ మునుగోడుకు నిధులు అడిగితే ఎందుకు పట్టించుకోవడం లేదు?” అంటూ రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొంటూనే, మునుగోడు అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేస్తే మరో కురుక్షేత్రం సృష్టిస్తానని హెచ్చరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతంగా చర్చలు ప్రారంభించింది.

ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందిస్తూ రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ పరిశీలిస్తోందని తెలిపారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించిన ఆయన, నేతల వ్యవహారశైలిని పార్టీ గమనిస్తోందన్నారు. కొండా సురేఖ విషయంలోనూ తొలిసారి వ్యాఖ్యలు చేసినప్పుడు చర్యలు తీసుకోలేదని, పలుమార్లు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు.

తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గదని, తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేసే ప్రశ్నే లేదని పేర్కొన్నారు. నీటి హక్కుల విషయంలో ఒక్క బొట్టు కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జి బి.ఎం. సందీప్‌ ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 22న గాంధీభవన్‌లో జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ)ల ఉమ్మడి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 23వ తేదీన గాంధీభవన్‌లో ఉదయం రాష్ట్ర మంత్రులతో, మధ్యాహ్నం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, పీసీసీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, జిల్లాల వారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పనితీరు, పార్టీ నేతల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఈ నెల 27న మరోసారి హైదరాబాద్‌కు రానున్న సందీప్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రాష్ట్రంలోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో నేరుగా మాట్లాడి పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలపై నివేదిక రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల పార్టీకి ఇబ్బందికరంగా మారిన వ్యాఖ్యలు చేస్తున్న నేతల వ్యవహారంపై పీఏసీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించే నేతల విషయంలో కఠినంగా ఉండాలని ఏఐసీసీ నుంచి సూచనలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే పీసీసీ ఏఐసీసీకి నివేదికలు పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఇన్‌ఛార్జి సందీప్‌ రాష్ట్ర ముఖ్యనేతలతో చర్చించి, ఆయా నేతల వివరణ తీసుకున్న తర్వాత పార్టీ అధిష్ఠానానికి నివేదించనున్నారు. అనంతరం పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Related News

Latest News