విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించాలి
చెకుముకి ప్రతిభా పరీక్షలో ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు దుబ్బుడు రవీందర్ రెడ్డి
ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 21: శాస్త్ర విజ్ఞానమే సమాజ అభివృద్ధికి పునాది అని, విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకొని ప్రతి విషయాన్ని ప్రశ్నించే, పరిశీలించే, విశ్లేషించే తత్వాన్ని పెంపొందించుకోవాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు గొట్టిపర్తి రామస్వామి గౌడ్, నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు దుబ్బుడు రవీందర్ రెడ్డి సూచించారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాలు, పరిశీలనలు, పరిశోధనల ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలని అన్నారు. శాస్త్రీయ దృక్పథం కలిగిన విద్యార్థులే భవిష్యత్తులో దేశాభివృద్ధికి దోహదపడతారని పేర్కొన్నారు. శనివారం నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో మండలస్థాయి చెకుముకి ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గొట్టిపర్తి రామస్వామి గౌడ్, దుబ్బుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.
వాటికి అనుగుణంగా విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మూఢ నమ్మకాలకు దూరంగా ఉంటూ శాస్త్రీయ ఆధారాలతో ఆలోచించడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతోపాటు పోటీతత్వం, ఆత్మవిశ్వాసం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చెకుముకి వంటి విజ్ఞాన పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
మండలస్థాయి పోటీల్లో విజేతలు
మండల స్థాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విభాగంలో రాజగోపాల్‌పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం సాధించారు. నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రెండో స్థానం, గట్లమల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మూడో స్థానం దక్కించుకున్నారు.రెసిడెన్షియల్ పాఠశాలల విభాగంలో అక్కెనపల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాల మొదటి స్థానం సాధించగా, నర్మెట్ట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ద్వితీయ స్థానం పొందింది.ఈ సందర్భంగా విజేతలను ముఖ్య అతిథి, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజ్ఞాన పోటీల్లో పాల్గొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు దుద్దెడ పరశురాములు, మన్మోహన్ రెడ్డి, సతీశ్, రాములు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.



























