ప్రతిపక్షం, ఆగస్టు 10: ‘ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు’.. ‘జెర్సీ’ సినిమాలోని ఈ డైలాగ్‌కు ఓ టెకీ కమ్‌బ్యాక్ స్టోరీ సరిగ్గా సరిపోతుంది. వ్యక్తిగత కారణాలతో ఐదు నెలల పాటు ఉద్యోగానికి దూరమైన ఆయన.. తిరిగి కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు ఏకంగా 36 ఇంటర్వ్యూలను ఎదుర్కొన్నారు. ఎన్నో తిరస్కరణలు ఎదురైనా పట్టువదలకుండా ప్రయత్నిస్తూ చివరకు హైదరాబాద్‌లో రూ.30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించారు.
సయాటికా సమస్య కారణంగా ఆ టెకీ ఐదు నెలల పాటు కెరీర్‌కు విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కెరీర్‌లో ఏర్పడిన గ్యాప్ కారణంగా వెంటనే ఉద్యోగం దక్కలేదు. వరుసగా ఇంటర్వ్యూలకు హాజరైనా కొన్ని చోట్ల ఎంపిక కాలేకపోయారు.
అయినా నిరాశ చెందకుండా తన ఖాళీ సమయాన్ని నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా జనరేటివ్ ఏఐపై దృష్టి పెట్టి కొత్త విషయాలను నేర్చుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు ఇంటర్వ్యూల్లో ఎదురైన ప్రశ్నలు, లోపాలను విశ్లేషించుకుని తనను తాను మరింత మెరుగుపరుచుకున్నారు.
ఈ క్రమంలో మొత్తం 36 ఇంటర్వ్యూలను ఎదుర్కొన్న ఆయనకు చివరకు హైదరాబాద్‌లో మంచి ఉద్యోగం లభించింది. ఏకంగా రూ.30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించి సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చారు.
తన ఉద్యోగ వేటకు సంబంధించిన ఇంటర్వ్యూల జాబితాను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ని తిరస్కరణలు ఎదురైనా ప్రయత్నాన్ని ఆపకూడదని, ప్రతి ఇంటర్వ్యూ నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుని ముందుకు సాగాలని సూచించారు.
కెరీర్‌లో గ్యాప్ వచ్చినా.. కొన్ని ఇంటర్వ్యూల్లో విఫలమైనా దానిని అంతిమంగా భావించకూడదని ఆయన కథ చెబుతోంది. నైపుణ్యాలను పెంచుకోవడం, ఓపికగా ప్రయత్నించడం, ప్రతి వైఫల్యం నుంచి నేర్చుకోవడం ద్వారా తిరిగి మంచి అవకాశాన్ని అందుకోవచ్చని ఈ టెకీ కమ్‌బ్యాక్ నిరూపించింది.





























