[t4b-ticker]

శ్రీచైతన్య హైస్కూల్‌లో దారుణం.. ర్యాగింగ్ పేరుతో టెన్త్ విద్యార్థిపై కర్రలతో దాడి!

ప్రతిపక్షం, ఆగస్టు 10: తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిపై దాడి జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మంచి విద్య అందుతుందనే నమ్మకంతో పిల్లలను కార్పొరేట్‌ పాఠశాలలకు పంపిస్తే.. అక్కడి యాజమాన్యాల నిర్లక్ష్యం, విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న అభిషేక్‌పై తోటి విద్యార్థులు ర్యాగింగ్‌ పేరుతో దాడి చేసినట్లు అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. కర్రలతో కొట్టడంతోపాటు బూటు కాళ్లతో తన్నినట్లు వారు వాపోయారు. ఈ దాడిలో అభిషేక్‌ తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.

గాయాలపాలైన విద్యార్థిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమారుడికి ఏం జరిగిందనే విషయంపై పాఠశాల యాజమాన్యం సరైన సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అభిషేక్‌ మెట్లపై నుంచి జారిపడి కిందపడటంతో గాయాలయ్యాయని పాఠశాల యాజమాన్యం చెప్పినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. అయితే తమ కుమారుడిపై ర్యాగింగ్‌ పేరుతో దాడి జరిగిందని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

విద్యార్థుల భద్రతకు సంబంధించి పాఠశాల యాజమాన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

Spread the love

Related News

Latest News