ప్రతిపక్షం, ఆగస్టు 14: కన్నడ నటి సోదరిపై అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిన ఆరోపణలపై రాఘవేంద్ర (28) అనే వ్యక్తిని చంద్రాలేఅవుట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే కార్యాలయంలో పనిచేసే సమయంలో బాధితురాలితో అతడికి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారినట్లు పోలీసులు తెలిపారు.
అయితే తనకు అప్పటికే వివాహం జరిగిందనే విషయాన్ని దాచిన రాఘవేంద్ర.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని ఆమెను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనను మోసం చేయడంతో పాటు బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన చంద్రాలేఅవుట్ పోలీసులు దర్యాప్తు చేపట్టి రాఘవేంద్రను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.





























