- కరీంనగర్ నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం
- నూతన కలెక్టరేట్‌లో సీఎం సమీక్షా సమావేశం
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, సెప్టెంబర్ 30: ప్రజలకు నమ్మకం కలిగించేలా అధికారులు పనిచేయాలి.. కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో అభివృద్ధి సీఎం కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనం పేదలకు నమ్మకాన్ని కల్పించే వేదికగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ఉద్యోగుల సంక్షేమం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం వంటి అంశాలపై మాట్లాడారు.పేదల సమస్యల చిక్కుముడులను విప్పేందుకు కలెక్టరేట్ కార్యాలయం ఉపయోగపడాలని సీఎం సూచించారు. సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని అన్నారు. సహాయం కోసం నిస్సహాయంగా కార్యాలయాలకు వచ్చే ప్రజల్లో తమ కుటుంబ సభ్యులను చూసినప్పుడే వారికి నూటికి నూరు శాతం న్యాయం చేయగలుగుతామని పేర్కొన్నారు.
- ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెంచాలి *
ప్రజలకు సేవలు అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సీఎం సూచించారు. అలా పనిచేసినప్పుడే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందని అన్నారు. ఉద్యోగులు కష్టపడి పనిచేస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని సీఎం తెలిపారు. ఉద్యోగుల సహకారంతో వీలైనంత మేర సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి మంచి పేరు రావాలన్నా ప్రజలకు సేవలు అందించే ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని అన్నారు.
- ప్రజలకు మెరుగైన సేవల కోసమే కొత్త భవనం *
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేశామని సీఎం తెలిపారు. ప్రజలకు సేవలు అందించే ఉద్యోగులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ భవన సముదాయాన్ని నిర్మించామని పేర్కొన్నారు.
- కేంద్రంతో సమన్వయంతోనే రాష్ట్ర అభివృద్ధి *
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్తామని రేవంత్ రెడ్డి అన్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మించినా కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు రాకపోతే వాటి వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు.సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని ఎన్నిసార్లైనా కలవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. అయితే తమ పర్యటనలను కొందరు లెక్కలేస్తున్నారని వ్యాఖ్యానించారు.గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఆరు నెలల్లోనే 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర అభివృద్ధి కోసం బదలాయించేలా చర్యలు తీసుకున్నామని సీఎం తెలిపారు. అలాగే బేగంపేట రన్‌వే కింద నుంచి రహదారి నిర్మాణానికి అవసరమైన అనుమతులు సాధించామని పేర్కొన్నారు.సిద్ధాంతాలు వేరైనా రాష్ట్ర అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
- జిల్లా అభివృద్ధిపై మరోసారి సమగ్ర సమీక్ష *
కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై మరోసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.






























