రైలు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలకు బీమా, నష్టపరిహారం చెల్లించాలి

గొర్రెల కాపరి రెడ్డయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
స్పందించని రెవెన్యూ, పశువైద్య అధికారులపై సీపీఎం నేతల ఆగ్రహం

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, సెప్టెంబర్ 30: రైలు ప్రమాదంలో గొర్రెలను కోల్పోయిన గొర్రెల కాపరి కోకట్ల రెడ్డయ్య అలియాస్ యాదయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ. మల్లేశం, కే. మల్లేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో అంబాదాస్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో 46 గొర్రెలు మృతి చెందగా, మరో 25 గొర్రెలు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఉన్నాయని తెలిపారు. ప్రమాదం జరిగినప్పటికీ స్థానిక పశువైద్య అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి గాయపడిన గొర్రెలకు కనీస వైద్యం అందించకపోవడం బాధాకరమన్నారు.

రెవెన్యూ అధికారులు కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించినప్పటికీ, గొర్రెల నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేయలేదని వారు ఆరోపించారు. గొర్రెల పెంపకమే జీవనాధారంగా కుటుంబాన్ని పోషించుకుంటున్న రెడ్డయ్యకు ఈ ప్రమాదం తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందన్నారు.మృతి చెందిన గొర్రెలకు బీమా పరిహారం అందించడంతో పాటు, మొత్తం నష్టాన్ని అంచనా వేసి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గాయపడిన గొర్రెలకు వెంటనే పశువైద్య చికిత్స అందించాలని కోరారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణ సహాయం అందించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News