ఇందిరమ్మ బీమా పథకం వీరికే మాత్రమే.. రేవంత్ సర్కార్ కొత్త గైడ్‌లైన్స్.. ఎవరెవరు అర్హులంటే..?

ప్రతిపక్షం, నవంబర్ 21: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ పథకం ద్వారా రూ.5 లక్షల బీమా పరిహారం అందించనున్నారు. రాష్ట్రంలోని దాదాపు కోటి కుటుంబాలకు బీమా రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. అదే రోజు నుంచి అర్హులైన వారి నమోదు ప్రక్రియ కూడా మొదలైంది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. అయితే ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న ఇతర బీమా పథకాల పరిధిలో ఉన్నవారు ఈ పథకానికి నమోదు చేసుకోవడానికి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులుగా నిర్ణయించారు. కుటుంబంలో ఒక్కరు మాత్రమే నమోదు చేసుకోవాలి. కుటుంబ పెద్ద లేదా కుటుంబానికి ఆదాయం సంపాదించి పెట్టే వ్యక్తి పేరుతోనే బీమా నమోదు చేయించుకోవాలి. ఎవరి పేరుతో బీమా పొందాలనుకుంటున్నారో ఆ వ్యక్తి స్వయంగా సమీపంలోని నమోదు కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవడంతో పాటు నామినీ వివరాలను అందించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ సమీపంలోని ఏదైనా నమోదు కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒకవేళ ఇద్దరు నామినీలను ఎంపిక చేసుకుంటే, బీమా పరిహారాన్ని వారిద్దరికీ ఏ నిష్పత్తిలో చెల్లించాలనుకుంటున్నారో దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి.

వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఆధార్‌లో పుట్టిన తేదీ తప్పుగా నమోదై ఉంటే, ముందుగా సంబంధిత వివరాలను సరిచేసుకున్న తర్వాతే బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ ఫోన్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నమోదు ప్రక్రియ నిర్వహించనున్నారు. రేషన్ కార్డులోని వివరాలను ప్రభుత్వ డేటాతో సరిపోల్చి కుటుంబ సభ్యుల వివరాలను అధికారులు ధ్రువీకరిస్తారు. రేషన్ కార్డులకు ఈ-కేవైసీ పూర్తి చేయని వారు ముందుగా ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ పథకంలో రేషన్ కార్డు నంబరునే దరఖాస్తు సంఖ్యగా పరిగణించనున్నారు.

అనారోగ్యం లేదా దివ్యాంగత్వం కారణంగా నమోదు కేంద్రానికి వెళ్లలేని వారికి కూడా ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. అలాంటి వారి ఇళ్లకు నమోదు శిబిరం ఇన్‌ఛార్జి నేరుగా వెళ్లి వివరాలను సేకరించి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. నామినీగా ఎంపిక చేసిన వ్యక్తి మైనర్ అయితే, అతనికి సంబంధించిన మేజర్ లేదా సంరక్షకుడి వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో నామినీ మరణించినా లేదా నామినీని మార్చుకోవాల్సిన అవసరం వచ్చినా ఆ మార్పు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దీంతో బీమా పరిహారం పొందే విషయంలో కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

పాలసీ ప్రారంభమైన తేదీ నుంచి నమోదు గడువు ముగిసే వరకు బీమా రక్షణ వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించారు. ప్రస్తుతం 58 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి ఈ పథకంలో నమోదు చేసుకున్నప్పటికీ, 59 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మాత్రమే బీమా రక్షణ కొనసాగుతుంది. అర్హులైన కుటుంబాలు గడువు ముగిసేలోపు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా మరణించినప్పుడు ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంటోంది. అందువల్ల అర్హత కలిగిన వారు అవసరమైన పత్రాలతో నమోదు కేంద్రాలను సంప్రదించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

Related News

Latest News