కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల వివరాలు అసెంబ్లీలో వెల్లడిస్తా: పొంగులేటి

ప్రతిపక్షం, నవంబర్ 21: ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూముల సర్వే దాదాపు పూర్తయిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే శాసనసభ వేదికగా వెల్లడిస్తామని తెలిపారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు. ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై ప్రభుత్వం చేపట్టిన సర్వే తుది దశకు చేరుకుందని, సర్వేకు సంబంధించిన లెక్కలు, ఇతర వివరాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

భూముల సర్వే ప్రారంభమైన సమయంలోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు తమ భూముల విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు స్టే తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఈ కారణంగా సర్వే ప్రక్రియకు సంబంధించి కొన్ని న్యాయపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. అయితే ప్రస్తుతం సర్వే దాదాపు పూర్తయిందని, అందుకు సంబంధించిన వివరాలను అసెంబ్లీలో ప్రజలకు తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని శాసనసభలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు భూ రికార్డులు, భూ లావాదేవీలకు సంబంధించిన భూభారతి పోర్టల్‌లో తలెత్తిన సమస్యలపైనా మంత్రి స్పందించారు. పోర్టల్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం సమస్యలు దాదాపుగా పరిష్కారమయ్యాయని వెల్లడించారు. భూభారతి సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎర్రవల్లి భూముల సర్వే వివరాలు, భూభారతి పోర్టల్ పనితీరుపై త్వరలో మరింత స్పష్టత ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Related News

Latest News