కల్తీ మద్యం మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

మణిపూర్‌ ఘటనపై రాహుల్‌ గాంధీ తీవ్ర ఆగ్రహం
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

ప్రతిపక్షం, చందేల్‌, నవంబర్ 22: మణిపూర్‌లో కల్తీ మద్యం సేవించి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం ప్రమాదం కాదని, బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. విషపూరిత మద్యం కారణంగా పలువురు మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘మణిపూర్‌లో కల్తీ మద్యం తాగి పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది ప్రమాదం కాదు.. బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితం. తొలుత హింసాకాండ వందలాది కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఇప్పుడు కల్తీ మద్యం వాటిని నాశనం చేస్తోంది. అయినా ప్రభుత్వం ఇంకా నిద్రపోతోంది.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు పూర్తి మద్దతుతోపాటు న్యాయమైన పరిహారం అందించాలి’ అని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. చందేల్‌ జిల్లాలోని చక్పి కరోంగ్‌, పరిసర ప్రాంతాల్లో స్థానికంగా తయారుచేసిన మద్యం సేవించడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మద్యంలో మెథనాల్‌ అనే విషపూరిత రసాయనం కలవడమే మరణాలకు కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది మరణించగా, 150 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఇంఫాల్‌లోని షిజా ఆస్పత్రితోపాటు బబినా ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

బాధితులను పరామర్శించిన సీఎం
మణిపూర్‌ ముఖ్యమంత్రి యుమ్నామ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ శుక్రవారం ఇంఫాల్‌లోని షిజా, బబినా ఆస్పత్రులను సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రత్యేక వైద్య బృందాన్ని, అత్యవసర మందులను చందేల్‌ జిల్లాకు పంపించారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.మరోవైపు అనుమానాస్పదంగా ఉన్న స్థానిక మద్యాన్ని సేవించవద్దని జిల్లా యంత్రాంగం ప్రజలను హెచ్చరించింది. అక్రమ మద్యం తయారీ కేంద్రాల గురించి సమాచారం అందించాలని కోరింది. మద్యంలో విషపూరిత రసాయనం ఎక్కడ కలిసింది? దాని తయారీ, సరఫరా వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

Related News