వార్తలకంటే ఫొటోలోనే ఆకర్షణ శక్తి ఎక్కువ

  • క్షణాల్లో వేల భావాలను పలికించే శక్తి చిత్రానిది
  • చరిత్రకు సాక్షిగా నిలిచేది ఫొటో జర్నలిజమే
  • స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ప్రతిపక్షం, హైదరాబాద్, నవంబర్ 22: పత్రికల్లో ప్రచురితమయ్యే వార్తల కంటే ఫొటోలోనే ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంటుందని, క్షణాల్లోనే వేల భావాలను ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లగల సామర్థ్యం చిత్రానికి ఉందని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చదివిన వార్తను పాఠకులు మరిచిపోయినా.. మనసును కదిలించే ఫొటో మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఫొటో కేవలం దృశ్యం కాదని, అదొక చరిత్ర అని అభివర్ణించారు. శనివారం బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన ఉత్తమ ఫొటో జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రజాస్వామ్య ఉద్యమాల వరకు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, పేదరికం, సామాజిక వివక్ష వంటి అనేక కీలక ఘట్టాలను ప్రపంచానికి పరిచయం చేసింది ఫొటో జర్నలిజమేనని కొనియాడారు. పేదల కన్నీళ్లు, ఆకలితో అలమటించే చిన్నారుల పరిస్థితి, అన్యాయంపై పోరాడే ప్రజల ఆవేదనను ప్రపంచం ముందుంచేది ఫొటో జర్నలిస్టుల కెమెరానేనని అన్నారు.

ఒక ఫొటో ప్రభుత్వాన్ని ఆలోచింపజేయగలదని, అధికార వ్యవస్థను ప్రశ్నించగలదని, ప్రజా ఉద్యమాలకు ప్రేరణగా నిలిచి సామాజిక మార్పునకు నాంది పలకగలదని స్పీకర్ పేర్కొన్నారు. ఫొటో జర్నలిస్టుల కెమెరా ఎప్పుడూ నిజం వైపు, వారి ఆలోచన ప్రజల పక్షాన ఉండాలని సూచించారు. వృత్తి నిబద్ధతతో జర్నలిజం విలువలను కాపాడాలని కోరారు. ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. డిజిటల్ కెమెరాలు, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, కృత్రిమ మేధ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఫొటో జర్నలిజంలో అనేక మార్పులు తీసుకొచ్చాయని అన్నారు. అయితే మార్ఫింగ్, నకిలీ ఫొటోలు, ఏఐతో సృష్టించిన దృశ్యాలు, తప్పుడు సమాచారంతో కూడిన చిత్రాలు సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే వృత్తి నైతికతను కాపాడుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కె. విరాహత్ అలీ మాట్లాడుతూ.. ఫొటో జర్నలిస్టు కేవలం మీడియా సంస్థ ఉద్యోగి కాదని, కాలానికి సాక్షి, చరిత్రలో సైనికుడని అభివర్ణించారు.

జర్నలిజం వృత్తిలో ఫొటో జర్నలిస్టుల కష్టాలు వర్ణనాతీతమని, విధి నిర్వహణతో పాటు కుటుంబ పోషణలోనూ వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సంక్షేమం కోసం తమ సంఘం నిరంతరం అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్, జాతీయ కార్యదర్శి వై. నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి, ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్. హరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ఫొటో జర్నలిస్టులను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సత్కరించి అవార్డులు అందజేశారు.

Related News