డీలిమిటేషన్‌పై కాంగ్రెస్‌ విమర్శలు

  • పార్లమెంట్‌ సమావేశాలు ముగియకుండానే 100 రోజులు
  • మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని

ప్రతిపక్షం నేషనల్ డెస్క్, న్యూఢిల్లీ, నవంబర్ 22: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి 100 రోజులు గడిచినా, ఇంకా అధికారికంగా ప్రోరోగ్‌ చేయకపోవడంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. డీలిమిటేషన్‌ బిల్లును ఆమోదింపజేసేందుకు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించే ప్రయత్నాల్లో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఉన్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆరోపించారు. దేశం ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని చేరుకునే వరకు నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేయాలని, ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్య, రాష్ట్రాల వారీ ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా సూచించారు. డీలిమిటేషన్‌ ప్రతిపాదనలపై రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరపలేదని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాలుగు లేఖలు రాసినా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. గతంలో ఇందిరాగాంధీ 1976లో, అటల్‌ బిహారీ వాజ్‌పేయి 2001లో నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్ల చొప్పున వాయిదా వేశారని జైరాం రమేశ్‌ గుర్తుచేశారు. ఇలాంటి కీలక అంశాలపై విస్తృత సంప్రదింపులు, ప్రశాంతమైన చర్చలు అవసరమన్నారు. కాగా, ఈ ఏడాది ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు ముగిసినా పార్లమెంట్‌ ప్రోరోగ్‌ కాలేదు. గతంలో 2008లో 87 రోజులు, 1987లో 76 రోజులు, 1989లో 54 రోజులు సమావేశాలను ప్రోరోగ్‌ చేయకుండా ఉంచిన సందర్భాలున్నాయి. తాజా పరిణామంతో ఆ రికార్డులన్నీ అధిగమించి 100 రోజులు పూర్తయ్యాయి.

Related News