ఉగ్రవాదంపై భారత్‌, ఫ్రాన్స్‌ ఉక్కుపాదం

  • నిధుల సరఫరా, ఆన్‌లైన్‌ తీవ్రవాద వ్యాప్తికి అడ్డుకట్ట
  • ‘ప్రహార్‌’ వ్యూహాన్ని వివరించిన భారత్‌

ప్రతిపక్షం నేషనల్ డెస్క్, న్యూఢిల్లీ, నవంబర్ 22: ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ ఉపేక్షించబోమని భారత్‌, ఫ్రాన్స్‌ స్పష్టం చేశాయి. సరిహద్దుల అవతలి నుంచి ప్రోత్సహించే ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాద కార్యకలాపాలను తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను అడ్డుకోవడం, ఆన్‌లైన్‌ వేదికల ద్వారా యువతను తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలను నిరోధించడం, సాంకేతికత దుర్వినియోగాన్ని కట్టడి చేయడంలో పరస్పర సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. నవంబర్‌ 20న న్యూఢిల్లీలో జరిగిన భారత్‌-ఫ్రాన్స్‌ ఉగ్రవాద నిరోధక సంయుక్త కార్యాచరణ బృందం 18వ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. భారత విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ సుహెల్‌ అజాజ్‌ ఖాన్‌, ఫ్రాన్స్‌ ప్రత్యేక ప్రతినిధి, రాయబారి ఒలివియర్‌ కారన్‌ సంయుక్తంగా సమావేశానికి అధ్యక్షత వహించారు.

2025 ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో పాటు, అదే ఏడాది నవంబర్‌లో ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద ఘటనను ఇరు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాద సంస్థల నిధుల సేకరణ, ఆన్‌లైన్‌ ప్రచారం, నియామకాలు, కొత్త సాంకేతికతల దుర్వినియోగంపై చర్చించాయి. నిఘా సమాచార మార్పిడి, శిక్షణ, భద్రతా సంస్థల సామర్థ్య పెంపు ద్వారా ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కోవాలని నిర్ణయించాయి. భారత్‌ రూపొందించిన సమగ్ర జాతీయ ఉగ్రవాద నిరోధక వ్యూహం ‘ప్రహార్‌’ గురించి ఫ్రాన్స్‌ ప్రతినిధులకు వివరించింది. ఐక్యరాజ్యసమితి, ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌), ‘నో మనీ ఫర్‌ టెర్రర్‌’ వంటి అంతర్జాతీయ వేదికలపై కూడా సమన్వయంతో పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. సంయుక్త కార్యాచరణ బృందం 19వ సమావేశాన్ని ఫ్రాన్స్‌లో నిర్వహించాలని నిర్ణయించాయి.

Related News