రాహుల్‌కు రిజిజు నాలుగు ప్రశ్నలు

  • 1962లో చైనా ఆక్రమణకు కాంగ్రెస్ క్షమాపణ చెబుతుందా?
  • భారత్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణ

ప్రతిపక్షం నేషనల్ డెస్క్, న్యూఢిల్లీ, నవంబర్ 22: ప్రధాని మోడీని ‘రాజీ పడిన ప్రధాని’గా అభివర్ణించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు. 1962లో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించినందుకు కాంగ్రెస్‌ క్షమాపణ చెబుతుందా? దేశం పేదరికంలో ఉండటానికి కారణమేంటి? భారత్‌ను ‘పాములు ఆడించే దేశం’గా ఎందుకు పిలిచేవారు? ఆర్థిక వ్యవస్థను ‘హిందూ వృద్ధి రేటు’గా ఎందుకు అవమానించారని నాలుగు ప్రశ్నలు సంధించారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా రాహుల్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఒకే టేబుల్‌ వద్ద ఉన్న ఫొటోలను రాహుల్‌ షేర్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే ఆ సమావేశంలో భారత ప్రధానికి కూడా చోటు దక్కేదని, రాజీపడిన ప్రధాని ఆ స్థాయిలో కూర్చోలేరని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేతలు రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పాలనలో భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ఏ అంతర్జాతీయ ఉన్నత వేదికలోనూ స్థానం దక్కలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ ప్రశ్నించారు. రాహుల్‌కు అంతర్జాతీయ రాజకీయాలపై అవగాహన లేదని, పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పలువురు బీజేపీ నేతలు విమర్శించారు.

Related News