- లోయలో లష్కరే చివరి ఉగ్రవాది హతం
- ఆర్టికల్ 370 రద్దుతో యువతలో వేర్పాటువాదానికి ముగింపు
- భద్రతా దళాల ధైర్యసాహసాలతోనే కశ్మీర్ దేశంలో అంతర్భాగం
- అరుణాచల్ పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ ప్రదానం చేసిన అమిత్ షా
ప్రతిపక్షం నేషనల్ డెస్క్, న్యూఢిల్లీ, నవంబర్ 22: కశ్మీర్ లోయలో స్థానిక ఉగ్రవాదులు ఎవరూ మిగలలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇటీవల పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న చివరి క్రియాశీల కశ్మీరీ ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయని వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీ యువతలో వేర్పాటువాద భావనకు ముగింపు పడిందని పేర్కొన్నారు. శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని బందర్దేవా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ పోలీసులకు ప్రతిష్టాత్మక ‘ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.1990లో కశ్మీర్లో ఉగ్రవాదం పరాకాష్టకు చేరుకుందని అమిత్ షా గుర్తుచేశారు. అప్పట్లో రాష్ట్రాన్ని భారత్‌లో అంతర్భాగంగా కొనసాగించగలమా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయని చెప్పారు. నాటి ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఇంగ్లాండ్ వెళ్లిపోయిన క్లిష్ట సమయంలో భద్రతా దళాల ధైర్యసాహసాలే కశ్మీర్‌ను దేశంతో ఐక్యంగా ఉంచాయని కొనియాడారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ప్రతిపక్షాలు దానికీ, ఉగ్రవాదానికీ సంబంధం ఏమిటని ప్రశ్నించాయని షా అన్నారు. కానీ ఆ నిర్ణయం కశ్మీరీ యువతలో వేర్పాటువాద భావనను తగ్గించిందని పేర్కొన్నారు. నేడు లోయలో ఒక్క స్థానిక యువకుడు కూడా ఉగ్రవాదిగా లేడని గర్వంగా చెప్పగలనన్నారు. అంతర్గత భద్రత, తిరుగుబాట్లు, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాల నియంత్రణలో అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని అమిత్ షా ప్రశంసించారు. ‘ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్’ పురస్కారం అందుకోవడం ఆ రాష్ట్ర పోలీసులకు, ప్రజలకు గర్వకారణమని అన్నారు. 2014 నుంచి మోడీ నాయకత్వంలో ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధి, శాంతి స్థాపనకు కొత్త ఊపొచ్చిందని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ను ‘సూర్యుడు ఉదయించే భూమి’గా అభివర్ణిస్తూ, దేశ భద్రత, అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాల ప్రాధాన్యాన్ని వివరించారు.





























