ప్రతిపక్షం, అక్టోబర్ 08: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. భారత ప్రజలపై కొంతమంది కుబేరులు ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారు తనను అడ్డుకుంటున్నారని మస్క్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యల్లో ప్రస్తావించిన కుబేరులు ఎవరనే విషయాన్ని బహిర్గతం చేయాలని కేటీఆర్ కోరారు. ‘‘ఎలాన్.. ఆ కుబేరుల పేర్లు బయటపెట్టండి. మా ప్రభుత్వంపై ఎవరు పట్టు బిగించారనేది దేశం తెలుసుకోవాలనుకుంటోంది’’ అంటూ ఆయన సామాజిక మాధ్యమ వేదికగా స్పందించారు.
మస్క్ చేసిన వ్యాఖ్యలు భారత రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చకు దారితీస్తున్న సమయంలో కేటీఆర్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశంలో కొంతమంది అత్యంత సంపన్నులు విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నారనే అర్థం వచ్చేలా మస్క్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయన ప్రస్తావించిన వ్యక్తుల వివరాలను వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అయితే మస్క్ తన వ్యాఖ్యల్లో ఎవరెవరిని ఉద్దేశించి ఈ ఆరోపణలు చేశారన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయ, సామాజిక మాధ్యమ వేదికల్లో చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన స్పందన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.





























