- స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన భవనంలో మౌలిక వసతులు కల్పించాలి
- వారం రోజుల్లో కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలి
- కలెక్టర్ చిత్రా మిశ్రా
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, అక్టోబర్ 08: స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన బాలసదనం నూతన భవనాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. భవనానికి కాంపౌండ్ వాల్, విద్యుత్, తాగునీరు, ఇతర అవసరమైన మౌలిక వసతులను కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.కరీంనగర్‌లోని క్రిస్టియన్ కాలనీలో ఉన్న బాలసదనం భవనాన్ని గురువారం సాయంత్రం కలెక్టర్ సందర్శించారు. బాలసదనం నిర్వహణ, అందుతున్న సేవలు, మౌలిక వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న శిశుగృహ కేంద్రాన్ని పరిశీలించారు.
అన్ని వసతులు కల్పించాలి
పక్కనే ఉన్న నూతన భవనాన్ని పరిశీలించిన కలెక్టర్.. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, కాంపౌండ్ వాల్ తదితర సౌకర్యాలు కల్పించి భవనాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. చిన్నారులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
చిన్నారుల సంరక్షణకు ప్రాధాన్యం
శిశుగృహంలోని చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. చిన్నారుల ఆలనాపాలనను జాగ్రత్తగా పర్యవేక్షించాలని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు.చిన్నారుల దత్తతకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారులను ఆదేశించారు.
చిన్నారులతో కొద్దిసేపు కలెక్టర్..
శిశుగృహాన్ని సందర్శించిన కలెక్టర్ చిత్రా మిశ్రా చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. కొద్దిసేపు వారితో గడిపిన ఆమె.. చిన్నారులను దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడారు. కొందరిని ఒడిలో కూర్చోబెట్టుకుని వారి ఆలనాపాలన, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఐడీఓసీలోకి సంక్షేమ కార్యాలయం
అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, చైల్డ్ ప్రొటెక్షన్ వింగ్ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించారు. ఆయా కార్యాలయాల పనితీరు, చేపడుతున్న కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సత్వరమే ఐడీఓసీ భవనంలోకి తరలించాలని ఆదేశించారు. చైల్డ్ ప్రొడక్షన్ వింగ్స్ ను కొత్త బాలసాధనం కేంద్రంలోకి తరలించాలన్నారు. ప్రజలకు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా సంక్షేమ అధికారి ఏం. సరస్వతి, డీసీపీఓ పర్వీన్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





























