విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

•రేవంత్ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ధ్వజం

వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 08, ప్రతిపక్షం: రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు విద్యార్థుల చావులకు వేదికలుగా మారుతున్నాయని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, నాసిరకం సరుకులు సప్లై చేసే డీలర్ల మధ్య కుదిరిన అక్రమ ఒప్పందాల వల్లే పేద విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని బిఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పెబ్బేరు పాలిటెక్నిక్ కాలేజీలో కలుషిత ఆహారం తిని 46 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటనపై బిఆర్‌ఎస్ వనపర్తి జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ తీవ్రంగా స్పందించారు.ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మరియు బిఆర్‌ఎస్‌వి జిల్లా కన్వీనర్ హేమంత్ ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 18 సార్లు గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయంటే ఈ పాలన ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది. ఒక్క వనపర్తి జిల్లాలోనే రేవల్లి గురుకుల, అమరచింత కేజీబీవీ, బుద్ధారం గురుకుల, కొత్తకోట గురుకుల, ఇప్పుడు పెబ్బేరు పాలిటెక్నిక్… ఇలా వరుసగా సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతోనే కాంట్రాక్టర్లు కుళ్లిన, నాసిరకం సరుకులను హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. కమిషన్ల కక్కుర్తితో విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తారా? అని నిలదీశారు.పదేళ్ల కేసీఆర్ సంక్షేమ పాలనలో గురుకులాలు, హాస్టళ్లలో నాణ్యమైన సన్నబియ్యం, పౌష్టికాహారాన్ని అందించి దేశానికే ఆదర్శంగా నిలిపామని, కానీ నేడు కాంగ్రెస్ హయాంలో కనీసం తిండి కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితి దాపురించిందని ధ్వజమెత్తారు.నాసిరకం ఆహార పదార్థాలు సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ల కాంట్రాక్టులను వెంటనే రద్దు చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వి నాయకులు సూర్యావంశం గిరి, హలీమ్ మరియు ఇతర ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News