ఎస్‌ఐఆర్‌ను అడ్డుకునేవారిపై బండి సంజయ్ ఫైర్

ప్రతిపక్షం, నవంబర్ 22: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అడ్డుకునే వారంతా దేశద్రోహులేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రి, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరుగా ఉండాలనే నిర్ణయం తీసుకునే అధికారం దేశ పౌరులకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు చేపడుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను రాజకీయ కారణాలతో అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ప్రజల్లో అనవసర అపోహలు, విభేదాలు సృష్టిస్తోందని మండిపడ్డారు.

కరీంనగర్‌లోని గురుద్వార్‌లో ఎంపీలాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన 11 కేవీ సోలార్ ప్యానెల్‌ను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లందరికీ జాబితాలో చోటు కల్పించడం, అనర్హుల పేర్లను తొలగించడం, ఓటర్ల వివరాల్లో తప్పులను సరిచేయడం వంటి చర్యల ద్వారా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎస్‌ఐఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో మహా పాదయాత్రలు నిర్వహిస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎస్‌ఐఆర్‌కు మద్దతు తెలియజేస్తున్నారని చెప్పారు. కరీంనగర్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్ర కూడా భారీ స్థాయిలో జరగనుందని, ఈ ర్యాలీ చరిత్ర సృష్టించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌కు రానున్నారని బండి సంజయ్ వెల్లడించారు. ఆయన రాకతో మహా పాదయాత్రకు మరింత ఉత్సాహం ఏర్పడుతుందని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌పై జరుగుతున్న ప్రచారానికి ప్రజలే తమ స్పందన ద్వారా సమాధానం చెబుతారని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, దాని పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని బండి సంజయ్ అన్నారు.

Related News

Latest News