ప్రతిపక్షం, నవంబర్ 22: డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం కోసం చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమంలో భాగస్వామి కావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ప్రభాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కిషన్ రెడ్డి, దేశంలో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గొంతు విప్పాలని కోరారు. నవంబర్ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై ప్రభాస్ సానుకూలంగా స్పందించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని, మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచడం, ముఖ్యంగా యువతను ఈ వ్యసనానికి దూరంగా ఉంచడం లక్ష్యంగా నషా ముక్త్ భారత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ పోరాటంలో సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు భాగస్వాములైతే సందేశం మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుందని అభిప్రాయపడ్డారు.
ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారని, ముఖ్యంగా యువతలో ఆయనకు విస్తృతమైన ఆదరణ ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇచ్చే సందేశం యువతపై ప్రభావం చూపగలదని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనే అవగాహనను మరింత మందికి చేరవేయడంలో ప్రముఖుల భాగస్వామ్యం కీలకమని అన్నారు. యువత తమ లక్ష్యాలపై దృష్టి సారించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఈ కార్యక్రమాల ద్వారా డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.






















