పార్టీ నేతల కదలికలపై నిఘా.. కష్టపడిన వారికే పదవులు: రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, నవంబర్ 23: కాంగ్రెస్ పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా తగిన గుర్తింపు, పదవులు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పదవుల కోసం గాంధీభవన్, ఢిల్లీ చుట్టూ తిరగడం కంటే గ్రామాలు, తండాల్లోని ప్రజల మధ్యకు వెళ్లి పనిచేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రతి నాయకుడి ప్రవర్తన, మాటతీరు, పార్టీ పట్ల చూపుతున్న నిబద్ధతను అధిష్ఠానం నిశితంగా గమనిస్తోందని తెలిపారు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు? ఎవరు పనిచేస్తున్నట్లు నటిస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారు? అనే విషయాలపై తమకు పూర్తి సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సందీప్ కుమార్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి నాయకుల పనితీరుకు సంబంధించి లెక్కలు వేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఎవరు ఎంత కష్టపడ్డారు? పార్టీ కోసం ఎలాంటి సేవలు అందించారు? ప్రజల్లో ఎంతగా పనిచేశారు? అనే అంశాలను పరిశీలిస్తామని వెల్లడించారు. పార్టీ కోసం నిజంగా శ్రమించిన వారిని తప్పకుండా గుర్తిస్తామని, పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ నష్టం కలిగించే వారిని కూడా గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. పదవుల కోసం నాయకులు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. పేదలకు ఆత్మబంధువుగా నిలిచే వారే నిజమైన కాంగ్రెస్ నాయకులని పేర్కొన్నారు. పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 65 మందికి ఇప్పటికే పదవులు కల్పించినట్లు తెలిపారు. పార్టీ పట్ల చిత్తశుద్ధి, కష్టం, నిబద్ధత చూపించిన వారికి గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు.

నాయకులు ప్రజల్లోకి వెళ్లేటప్పుడు ప్రభుత్వ పనితీరును సమర్థంగా వివరించాలని సీఎం సూచించారు. “మంచిని మైక్‌లో చెప్పండి.. చెడును చెవిలో చెప్పండి” అంటూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలని కోరారు. మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేశామని, వాటిపై వడ్డీ రూపంలో ప్రభుత్వం రూ.2 వేల కోట్లు చెల్లించిందని వివరించారు. గతంలో జరిగిన అభివృద్ధి మాత్రమే ఉందని, భవిష్యత్తులో ఏమీ ఉండదన్నట్టుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు వస్తానని గతంలోనే చెప్పానని, గజ్వేల్‌లో దళిత, గిరిజన దండోరా నిర్వహించి కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పంపించామని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కరవు పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ప్రతి గ్రామం, ప్రతి తండాలో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించాలని సూచించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అచ్చంపేట సమీపంలో సేవాలాల్ మందిరాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. జ్యోతిబా ఫూలే దంపతులు, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని, త్వరలో పండుగ సాయన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమాజంలో వెనుకబడిన వర్గాల నుంచి ఎదిగి ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులను గౌరవించాలనే ఆలోచన గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలోనూ అండగా నిలిచిన చరిత్ర ఉందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇందిరాగాంధీ చివరి శ్వాస విడిచే సమయానికి మెదక్ ఎంపీగా ఉన్నారని ప్రస్తావించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 15 ఎంపీ స్థానాలను గెలుచుకుని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యతను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తీసుకోవాలని అన్నారు. సామా రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలకు పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించిందని, పార్టీ కోసం కష్టపడిన వారికి అడగకుండానే గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం నిరాశలో ఉన్న నాయకులకు కూడా భవిష్యత్తులో తగిన గుర్తింపు వస్తుందని భరోసా ఇచ్చారు.

తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోటి ఓట్లు సాధించి 90 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులను బలవంతంగా, అక్రమ కేసుల ద్వారా బీఆర్ఎస్‌లోకి తీసుకెళ్లారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేస్తానని కేసీఆర్ గతంలో వ్యాఖ్యానించినప్పటికీ, పార్టీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పార్టీని నిలబెట్టారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి కూడా సీఎం వివరించారు. కేవలం 90 రోజుల్లో 48 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించామని, దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్‌కు దక్కిందని తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ కార్యకర్తలు పట్టుదలతో పనిచేశారని ప్రశంసించారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన కార్యకర్తలను రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లి అభినందింపజేశామని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 92,35,833 ఓట్లు సాధించి 64 స్థానాల్లో గెలుపొందిందని, మిత్రపక్షమైన సీపీఐ మరో స్థానంలో విజయం సాధించిందని వివరించారు. 90 లక్షలకు పైగా ఓట్లు సాధించడం వెనుక కార్యకర్తల కష్టం, త్యాగం ఉన్నాయని పేర్కొన్నారు.

కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపైనా రేవంత్ రెడ్డి సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం ద్వారా ఉపకులాల మధ్య సఖ్యతకు అవకాశం కల్పించామని తెలిపారు. దేశంలో జంతువుల జనాభాను కూడా లెక్కిస్తున్నప్పటికీ, బీసీల జనాభా ఎంతన్నది ఇప్పటివరకు స్పష్టంగా లెక్కించలేదని విమర్శించారు. దాదాపు 95 ఏళ్ల తర్వాత తెలంగాణలో కులగణన నిర్వహించామని, చట్టపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియను చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణలో నిర్వహించిన కులగణనను దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని వెల్లడించారు. మొత్తంగా పార్టీ నాయకులు పదవుల కోసం ప్రయత్నించడం కంటే క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని, పార్టీ కోసం కష్టపడిన వారికే భవిష్యత్తులో గుర్తింపు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Related News

Latest News