ప్రతిపక్షం, నవంబర్ 23: దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలంటే వివిధ వామపక్ష పార్టీలన్నీ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి విలీనం కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీల నాయకులు వ్యక్తిగత అహంభావాలను, ఆధిపత్య ధోరణులను వీడి ఐక్యత దిశగా అడుగులు వేయాలని సూచించారు. వివిధ పార్టీలుగా విడిపోయి పనిచేయడం వల్ల వామపక్ష ఉద్యమం బలహీనపడుతోందని, అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఒక్కటైతే వామపక్ష భావజాలాన్ని ఆదరించే ప్రజలు, ప్రజా సంఘాల సభ్యులు, అభ్యుదయవాదులు, మేధావుల్లో కొత్త ఉత్సాహం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఐక్యతతో ప్రజా సమస్యలపై మరింత సమర్థంగా పోరాడేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష, ప్రజాతంత్ర ఐక్యవేదిక (యూఎల్‌డీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో జస్టిస్ చంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘దేశం కోసం వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత ఎంతో అవసరమని వివరించారు. కమ్యూనిస్టు పార్టీల మధ్య ఉన్న విభేదాలు, నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉద్యమ విస్తరణకు అడ్డంకిగా మారకూడదని సూచించారు. అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావడంతో పాటు విలీన దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు.
దేశంలో మతోన్మాద శక్తులు రోజురోజుకూ బలోపేతమవుతున్నాయని, మరోవైపు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు బలహీనపడుతున్నాయని జస్టిస్ చంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వామపక్ష, ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామిక, బహుజన శక్తులు పరస్పర విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయడంతో పాటు సమాజానికి ప్రత్యామ్నాయ రాజకీయ, సామాజిక మార్గాన్ని చూపాల్సిన బాధ్యత ఈ శక్తులపై ఉందని పేర్కొన్నారు.
వామపక్ష పార్టీల ఐక్యత కోసం వామపక్ష, ప్రజాతంత్ర ఐక్యవేదిక ప్రయత్నాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఈ దిశగా మరింత విస్తృతమైన చర్చలు, సమన్వయ కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రజల్లో ఉన్న ఆదరణను తిరిగి బలోపేతం చేయాలంటే నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామూహిక లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్ని కమ్యూనిస్టు పార్టీలు విలీనమై ఐక్యంగా ముందుకు సాగితే వామపక్ష సానుభూతిపరులు, ప్రజా సంఘాలు, మేధావులు, అభ్యుదయవాదులు మరింత ఉత్సాహంతో ఉద్యమంలో భాగస్వాములవుతారని జస్టిస్ చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు.






















