హైదరాబాద్ గోల్డ్‌మ్యాన్‌కు ఐటీ శాఖ షాక్.. రూ.కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ అటాచ్!

ప్రతిపక్షం, నవంబర్ 23: బంగారు ఆభరణాలు ధరించి హైదరాబాద్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోల్డ్‌మ్యాన్ యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ కుటుంబానికి చెందిన ఆస్తి వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ కీలక చర్యలు చేపట్టింది. నగరంలోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న భారీ అపార్ట్‌మెంట్ భవనాన్ని బినామీ ఆస్తిగా అనుమానిస్తూ తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ భవనం కొనుగోలు, నిర్మాణానికి అవసరమైన నిధులు ఎవరు సమకూర్చారు? ఆస్తి ఎవరి ఆధీనంలో ఉంది? దాని ద్వారా వస్తున్న అద్దె ఆదాయం ఎవరికి చేరుతోంది? అనే అంశాలపై ఐటీ శాఖ బినామీ నిరోధక విభాగం దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో పలు కీలక ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

దర్యాప్తు వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో ఉన్న నవ ఖల్సా గ్రామంలో 222 చదరపు గజాల స్థలాన్ని 2019 జూలైలో కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఈ స్థలం విలువను రూ.26.70 లక్షలుగా నమోదు చేశారు. ఇందులో రూ.1.70 లక్షలు నగదు రూపంలో చెల్లించగా, మిగిలిన రూ.25 లక్షలను మూడు బ్యాంకు లావాదేవీల ద్వారా చెల్లించినట్లు గుర్తించారు. అయితే ఈ మొత్తాన్ని తానే సమకూర్చలేదని, తన బావ డబ్బులు ఇచ్చారని ప్రణయ్ గౌడ్ విచారణ సందర్భంగా వెల్లడించినట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు.

ఆ స్థలంలో అనంతరం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తులతో భారీ అపార్ట్‌మెంట్ నిర్మించారు. ప్రతి అంతస్తులో రెండు చొప్పున మొత్తం 12 రెండు పడక గదుల ఫ్లాట్లు ఏర్పాటు చేశారు. ఈ భవనం నిర్మాణానికి సంబంధించిన ఖర్చులను కూడా తన బావే భరించినట్లు ప్రణయ్ గౌడ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. నిర్మాణ పనుల కోసం డెవలపర్లకు చెల్లింపులు జరిపేందుకు తనఖా రుణం తీసుకున్న అంశాన్ని కూడా అధికారులు పరిశీలించారు. అయితే ఆస్తి కొనుగోలు, నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చిన వ్యక్తి ఎవరనే అంశంపై ఐటీ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఈ వ్యవహారంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అపార్ట్‌మెంట్ ప్రణయ్ గౌడ్ పేరుతో రిజిస్టర్ అయినప్పటికీ, స్థలం కొనుగోలు చేసిన సమయంలో ఆయన విద్యార్థిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అప్పట్లో తనకు పన్ను చెల్లించదగిన ఆదాయం లేదని విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇంత విలువైన స్థలాన్ని కొనుగోలు చేసి, భారీ భవనాన్ని నిర్మించే ఆర్థిక సామర్థ్యం తనకు ఉందని నిరూపించే ఆధారాలను కూడా సమర్పించలేకపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆస్తి పేరు మీద ఉన్న వ్యక్తి కాకుండా, దానికి అవసరమైన డబ్బు సమకూర్చిన వ్యక్తే అసలు లబ్ధిదారుడై ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

అపార్ట్‌మెంట్ ద్వారా వస్తున్న అద్దె ఆదాయం కూడా ఐటీ అధికారుల విచారణలో కీలకంగా మారింది. ఈ భవనంలోని ఫ్లాట్లను అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతి నెలా సుమారు రూ.3.20 లక్షల ఆదాయం వస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ అద్దె సొమ్ము రికార్డుల్లో ఆస్తి యజమానిగా ఉన్న ప్రణయ్ గౌడ్ బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదని అధికారులు గుర్తించారు. ఆయన బావ భార్యకు చెందిన సిటీ యూనియన్ బ్యాంకు ఖాతాలోకి అద్దె డబ్బులు చేరుతున్నట్లు బ్యాంకు లావాదేవీల పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం. అక్కడి నుంచి ఆమె భర్త ఖాతాలకు కూడా నగదు బదిలీ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో ఆస్తి యాజమాన్యం, అద్దె ఆదాయం మధ్య ఉన్న సంబంధాలపై మరింత లోతుగా విచారణ చేపట్టారు.

ఈ ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న బినామీ నిరోధక విభాగం ప్రణయ్ గౌడ్‌ను బినామీదారుడిగా, ఆయన బావను ఆస్తికి అసలు లబ్ధిదారుడిగా పేర్కొంటూ చర్యలు చేపట్టింది. ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ నవంబర్ 17న ఈ ఆస్తిని తాత్కాలికంగా అటాచ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం-1988లోని సెక్షన్ 24(4)(a) ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

దీంతో రాయదుర్గంలోని సదరు అపార్ట్‌మెంట్‌పై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు భవనాన్ని విక్రయించడం, ఇతరులకు బదిలీ చేయడం, యాజమాన్య హక్కుల్లో మార్పులు చేయడం సాధ్యం కాదు. అంతేకాకుండా ఆస్తి ద్వారా వస్తున్న అద్దె ఆదాయంపైనా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఆస్తికి సంబంధించిన అసలు యాజమాన్యం ఎవరిది? కొనుగోలు, నిర్మాణానికి నిధులు సమకూర్చిన వ్యక్తి ఎవరు? అనే అంశాలపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. అప్పటివరకు ఈ తాత్కాలిక అటాచ్‌మెంట్ కొనసాగనుంది. హైదరాబాద్‌లో గోల్డ్‌మ్యాన్‌గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్న గౌడ్ కుటుంబానికి సంబంధించిన ఈ ఆస్తి వ్యవహారం ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Latest News