ప్రతిపక్షం, నవంబర్ 23: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో పనులు చేపడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎలాంటి అనుమతులు, ముందస్తు సమాచారం లేకుండా నాగార్జున సాగర్ పరిధిలో చేపడుతున్న ఈ పనులను వెంటనే నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్‌ను కోరారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో కేఆర్ఎంబీ చైర్మన్‌తో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు సమావేశమై పల్నాడు వాటర్ గ్రిడ్ అంశంపై వినతిపత్రం అందించారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కృష్ణా జలాల్లో ఎక్కువ వాటాను వినియోగించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి 9 టీఎంసీల నీటిని కోరడం అన్యాయమని విమర్శించారు. నాగార్జున సాగర్ జలాశయం పరిధిలో చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ పనులను తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కేఆర్ఎంబీ చైర్మన్‌ను కోరినట్లు తెలిపారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని సుమారు రెండున్నర కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే అధిక మొత్తంలో నీటిని వినియోగించుకున్న ఏపీ ప్రభుత్వం, మూడు నెలల కాలానికి 30 లక్షల మంది ప్రజలకు తాగునీటి అవసరాల కోసం మరో 9 టీఎంసీలు కావాలని అడగడం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలను పక్కనపెడతారా అని నిలదీశారు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పట్టిసీమ ద్వారా నీటిని తరలించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మరోవైపు నూజివీడు ప్రాంతానికి నీటి అవసరాల పేరుతో అదనపు నీటిని కోరడం సరికాదని విమర్శించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పల్నాడు వాటర్ గ్రిడ్ అంశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించిన తర్వాతే ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు సమాచారం ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలోని కొందరు నాయకులు కేవలం తాగునీటి అవసరాల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని సమర్థించడం సరికాదని అన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో గతంలో తాగునీటి పేరుతో జరిగిన పరిణామాల తరహాలోనే నాగార్జున సాగర్ వద్ద కూడా కుట్ర జరుగుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు లొంగిపోయి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాడితే ఈ పనులను నిలిపివేయించే అవకాశం ఉందని కేఆర్ఎంబీ వర్గాలు తెలిపినట్లు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించినా, స్పందించకపోయినా బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు ఇన్ని నెలలుగా కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు తెలియలేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. 24 గంటల పాటు ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం, ప్రాజెక్టు పనులు జరుగుతున్న విషయాన్ని గుర్తించలేకపోయిందా అని నిలదీశారు. పనుల సమయంలో బ్లాస్టింగ్ జరిగినా ప్రభుత్వానికి సమాచారం లేదా అని అనుమానం వ్యక్తం చేశారు. పల్నాడు గ్రిడ్‌కు సంబంధించిన పత్రాలను చూపిస్తూ బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2026 జీవో ప్రకారమే టెండర్లు పిలిచి పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. అధికంగా నీటిని వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు నిజమైతే పంటలు ఎందుకు ఎండిపోయాయని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ జిల్లాకు వచ్చినా ప్రజల వద్దకు వెళ్లి నీటి వినియోగంపై వాస్తవాలు తెలుసుకోవాలని సవాల్ విసిరారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పల్నాడు వాటర్ గ్రిడ్ వల్ల హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం నీటిని తరలించుకుపోతున్నా, ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతున్నా తెలంగాణ ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం దారుణమని విమర్శించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ట్యాంకర్లపై ఆధారపడే కుటుంబాల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పల్నాడు వాటర్ గ్రిడ్ పనులను నిలిపివేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సైతం ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. తాగునీటి అవసరాల పేరుతో ఎనిమిది టీఎంసీల నీటిని తరలించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్లే తెలంగాణకు ఈ పరిస్థితి ఎదురైందని మండిపడ్డారు. పాలమూరు జిల్లాలో మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయని, నీటి సమస్యలు రైతులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ తాగునీటి సమస్యతో పాటు పల్నాడు వాటర్ గ్రిడ్ పనుల అంశాన్ని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఏపీలో చేపడుతున్న పనులను నిలిపివేయాలని కోరినట్లు వెల్లడించారు. బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి సహకరిస్తోందని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టి ఇప్పటికే 80 శాతం పూర్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. పల్నాడు వాటర్ గ్రిడ్ పనులను తక్షణమే నిలిపివేసి తెలంగాణ ప్రజల నీటి హక్కులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


























