ప్రతిపక్షం, నవంబర్ 23: తెలంగాణలో 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. పుష్కరాల ప్రచారంలో భాగంగా ఆకర్షణీయమైన లోగో, ట్యాగ్‌లైన్ రూపొందించేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక పోటీలకు శ్రీకారం చుట్టింది. కళాకారులు, డిజైనర్లు, సృజనాత్మకత కలిగిన యువత తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పోటీలకు సంబంధించిన వర్క్‌షాప్‌ను సోమవారం హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గోదావరి పుష్కరాల ప్రాధాన్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా లోగో, ట్యాగ్‌లైన్ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు, కళాకారులు, గ్రాఫిక్ డిజైనర్లు, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేలా ఆహ్వానిస్తోంది. పుష్కరాల సంప్రదాయం, గోదావరి నది విశిష్టత, తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవం ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో పోటీలకు సంబంధించిన ఎంట్రీలను స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్నవారు తమ లోగో, ట్యాగ్‌లైన్ డిజైన్లను నవంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు [email protected] అనే ఈ-మెయిల్ చిరునామాకు పంపించాలని అధికారులు తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు నిర్ణీత గడువులోగా తమ సృజనాత్మక ఆలోచనలను డిజైన్ల రూపంలో పంపించాల్సి ఉంటుంది.
ఉత్తమంగా నిలిచిన డిజైన్లకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందించనున్నారు. మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేల నగదును ప్రకటించారు. ప్రతిభ ఆధారంగా ఉత్తమ లోగో, ట్యాగ్లైన్లను ఎంపిక చేసి పుష్కరాల ప్రచార కార్యక్రమాల్లో ఉపయోగించనున్నారు. ఈ పోటీల ద్వారా యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు గోదావరి పుష్కరాలపై ప్రజల్లో ముందస్తు అవగాహన పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26న ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు భక్తులకు అవసరమైన రవాణా సౌకర్యాలు, రహదారులు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తోంది.
ఉత్తర భారతదేశంలో జరిగే కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ వేడుకను తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే మహత్తర కార్యక్రమంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పుష్కరాల నిర్వహణలో ప్రజలు, కళాకారులు, యువత భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది.






















