ప్రతిపక్షం, నవంబర్ 23: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఏటీఎంలా పనిచేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర విమర్శలు చేశారు. దేశాభివృద్ధి కంటే రాహుల్ గాంధీకి తన కుటుంబ అభివృద్ధిపైనే ఆసక్తి ఉందని ఆరోపించారు. విదేశాలకు వెళ్లి భారతదేశ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన బీజేపీ మహా పాదయాత్రలో నితిన్ నబీన్ పాల్గొని పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఇండియా కూటమి అనవసర రాద్ధాంతం చేస్తోందని నితిన్ నబీన్ విమర్శించారు. ఓట్ల చోరీ జరుగుతోందంటూ రాహుల్ గాంధీ పదేపదే ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని, బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని గుండెల్లో పెట్టుకుని గౌరవిస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలో 13 కోట్ల ఓట్లు చోరీ అయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని, అయితే మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగాలా? అని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి రెండు చోట్ల ఓట్లు ఉండాలా? అని నిలదీశారు. ఓటర్ల జాబితాలో అర్హులైన వారికే స్థానం ఉండాలని, చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించే అవకాశం రాజ్యాంగం ఇవ్వదని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై బీజేపీ వివరణకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని, కరీంనగర్లో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో గత ఎన్నికల్లో ప్రజలు ఒక అవినీతి పాలనకు ముగింపు పలికారని, ప్రస్తుతం అంతకంటే ఎక్కువ అవినీతి జరుగుతోందని నితిన్ నబీన్ ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ త్వరలోనే పదవి నుంచి దిగిపోతారని కొందరు చేస్తున్న వ్యాఖ్యలకు ఎన్నికల ఫలితాలే సమాధానం చెబుతాయని అన్నారు. మరోసారి ఎర్రకోటపై కాషాయ జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీకి ముందు ఏ ప్రధానమంత్రి కూడా సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకోలేదని గుర్తుచేశారు. విదేశీ ప్రేరేపిత ప్రచారంతో దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తగిన విధంగా గౌరవించలేదని నితిన్ నబీన్ విమర్శించారు. పీవీకి తగిన గుర్తింపు, గౌరవం కల్పించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ బలంగా లేదని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కరీంనగర్లో ప్రజలు, కార్యకర్తల నుంచి లభిస్తున్న స్పందనే సమాధానమని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని, రాష్ట్రంలో రామరాజ్యం, మోదీ రాజ్యం రావాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ లేదని చెబుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్లో జరుగుతున్న పరిణామాలను ఒకసారి గమనించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి 90 స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, ఆ సంఖ్య ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు అవకాశమిచ్చారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు చర్చించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ గడ్డపై బీజేపీ కార్యకర్తలు జైశ్రీరామ్ నినాదాలతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. నితిన్ నబీన్ నాయకత్వంలో పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. తమ శరీరంలో దేశభక్తి అనే రక్తం ప్రవహిస్తోందని, తెలంగాణలో బీజేపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో మరణించిన వ్యక్తుల ఓట్లను తొలగించాలా? వద్దా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించినప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆయన ఓటును తొలగించలేదని గుర్తుచేశారు. దేశంలో ప్రధానిని నిర్ణయించేది ప్రజలేనని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం కారణంగా యువత ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
కరీంనగర్లోని గాంధీ చౌక్ నుంచి కమాన్ చౌరస్తా వరకు నితిన్ నబీన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహా పాదయాత్ర నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని బీజేపీ వర్గాలు తెలిపాయి. ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం.. అరాచకాన్ని అంతం చేద్దాం’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా 40 భారీ ర్యాలీలు నిర్వహించేందుకు బీజేపీ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా కరీంనగర్లో ఈ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



















