విగ్రహం తొలగించిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
మున్సిపల్ కార్యాలయం ఎదుట KVPS ధర్నా
ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్,అక్టోబర్ 9: మెదక్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా KVPS రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం. అడివయ్య మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణలో భాగంగా 2021లో తొలగించిన పలు విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించిన అధికారులు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. గతంలో విగ్రహాల పునఃప్రతిష్ఠకు హామీ ఇచ్చిన నాయకులు ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం లేకపోవడం విచారకరమని, విగ్రహాన్ని తొలగించడంలో చూపిన చొరవను తిరిగి ఏర్పాటు చేయడంలోనూ అధికారులు చూపాలని అన్నారు. విగ్రహాన్ని తొలగించి, తిరిగి ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ ఎమ్మెల్యే వెంటనే స్పందించి విగ్రహ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో KVPS జిల్లా కార్యదర్శి కె. నిరంజన్ దాసు, నాయకులు కె. మల్లేశం, కవిత, జి. వెంకన్న, యాదగిరి, దుర్గ, నీలం బాబు, మంగ్లీ, యూసుఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.




























