ప్రతిపక్షం, నవంబర్ 24: కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరోసారి ఏకాభిప్రాయం కుదరలేదు. హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ నిర్వహించిన సమావేశం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల తాగునీరు, సాగునీటి అవసరాలు, నీటి కేటాయింపులు, నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఇరు రాష్ట్రాల అధికారులు తమ తమ వాదనలకే కట్టుబడటంతో ప్రతిష్ఠంభన కొనసాగింది. దీంతో కృష్ణా జలాల పంపిణీ వివాదానికి మరోసారి పరిష్కారం లభించలేదు.
కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు రమేష్‌బాబు, నరసింహమూర్తి హాజరయ్యారు. సమావేశంలో మొత్తం 19 డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమకు 21 టీఎంసీల కృష్ణా జలాలు అవసరమని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల అవసరాలు, ఇప్పటికే జరిగిన నీటి వినియోగం, భవిష్యత్తులో తాగు, సాగునీటి అవసరాలపై అధికారులు తమ అభిప్రాయాలను కమిటీ ముందు ఉంచారు.
ముఖ్యంగా నాగార్జునసాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం 9 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. ప్రజల తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని వెంటనే నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఏపీ అభ్యర్థనపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనకు కేటాయించిన వాటా కంటే ఎక్కువ మొత్తంలో కృష్ణా జలాలను వినియోగించుకుందని తెలంగాణ తరఫున అధికారులు వాదించారు. ఈ నేపథ్యంలో అదనంగా మరో 9 టీఎంసీల నీటిని కేటాయించడం సమంజసం కాదని తమ వ్యతిరేకతను వెల్లడించారు. దీంతో నాగార్జునసాగర్ నీటి విడుదల అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సమావేశంలో పట్టిసీమ వాటర్ గ్రిడ్ అంశాన్ని కూడా తెలంగాణ అధికారులు ప్రస్తావించినట్లు సమాచారం. కృష్ణా జలాల వినియోగం, ఇతర నీటి సరఫరా ప్రాజెక్టుల ప్రభావం వంటి అంశాలపై తమ అభ్యంతరాలను తెలియజేశారు. మరోవైపు పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న నీటి సరఫరా పనుల అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న గ్రామీణ నీటి సరఫరా పథకాల పనులకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందుబాటులో లేవని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు కమిటీకి తెలిపినట్లు సమాచారం.
మొత్తంగా కృష్ణా జలాల పంపిణీ, నాగార్జునసాగర్ నుంచి తాగునీటి విడుదల, రెండు రాష్ట్రాల నీటి వాటాలు, పట్టిసీమ, పల్నాడు వాటర్ గ్రిడ్ తదితర అంశాలపై చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. రెండు రాష్ట్రాలు తమ తమ డిమాండ్లపై పట్టుబట్టడంతో త్రిసభ్య కమిటీ తుది నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీంతో కృష్ణా జలాల పంపిణీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రానున్న సమావేశాల్లోనైనా ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం కుదిరి నీటి కేటాయింపుల సమస్యకు పరిష్కారం లభిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
























