దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
మద్దతు ధరకే ధాన్యం విక్రయించాలి
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్
ప్రతిపక్షం ప్రతినిధి, ఖానాపూర్, నవంబర్ 24: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేలా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్ సూచించారు. మధ్య దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు మండలంలోని మస్కాపూర్, సుర్జపూర్ గ్రామాల్లో సోమవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్ తదితరులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.ప్రభుత్వం ఏ-గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,161, సాధారణ రకం ధాన్యానికి రూ.2,141 మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. ప్రభుత్వం సూచించిన సన్న రకం ధాన్యానికి అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ అందజేస్తుందని వివరించారు.
ధాన్యం కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, తేమశాతం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, శుభ్రం చేసి కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులు ముందస్తుగా ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, పట్టాదారు పాస్బుక్ వెంట తీసుకురావాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు వెల్లడించారు.రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా లబ్ధి పొందాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, పీఏసీఎస్ చైర్మన్లు అమంద శ్రీనివాస్, ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కరిపె శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, సుర్జపూర్ సర్పంచ్ బక్కశెట్టి వెంకట్ రాములు, కౌన్సిలర్ నిమ్మల రమేష్, నాయకులు జంగిలి శంకర్, గొర్రె గంగాధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, మాజీ వైస్ చైర్మన్ కావలి సంతోష్, మాజీ కౌన్సిలర్ జన్నారపు శంకర్, మాజీ సర్పంచ్ నేరెళ్ల సత్యనారాయణ, ఆకుల వెంక గౌడ్,గాజుల గంగన్న, సీఈఓ శ్రీనివాసరెడ్డి,గుగ్గిళ్ల రాజేందర్ గౌడ్,రైతులు,పీఏసీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
























