ఇందిరమ్మ టవర్స్‌ లబ్ధిదారులకు ఉచిత రిజిస్ట్రేషన్‌: మంత్రి పొంగులేటి

ప్రతిపక్షం, నవంబర్ 24: హైదరాబాద్‌లో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇందిరమ్మ టవర్స్‌ పథకం కింద ఇళ్లు పొందే లబ్ధిదారులకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ఖర్చులు లేకుండా ఉచితంగా ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేసి అందజేయనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల విలువైన ఆస్తి సమకూరుతుందని ఆయన వెల్లడించారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఇందిరమ్మ టవర్స్‌ ప్రాజెక్టుకు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) గుర్తింపు లభించడం మరో కీలక పరిణామంగా మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టుకు రెరా గుర్తింపు రావడం పారదర్శకత, లబ్ధిదారుల హక్కుల పరిరక్షణ దిశగా ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి తన ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. రెరా పరిధిలో ప్రాజెక్టు నమోదు కావడంతో నిర్మాణానికి సంబంధించిన వివరాలు, నిబంధనలు, లబ్ధిదారుల ప్రయోజనాల విషయంలో స్పష్టత ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు చట్టపరమైన భద్రత కల్పించేందుకు ఈ గుర్తింపు దోహదపడనుంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నివసిస్తున్న నిరుపేదలకు సొంత ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో సుమారు లక్ష ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా తొలి దశలో మలక్‌పేట, కుత్బుల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని అందించడంతో పాటు, లబ్ధిదారులకు కేటాయించే ఫ్లాట్లకు సంబంధించిన అవిభక్త భూమి వాటా (యూడీఎస్‌)ను వారి పేరుపై నమోదు చేయనుంది. తద్వారా ఫ్లాట్‌తో పాటు భూమిలోనూ లబ్ధిదారులకు హక్కు కల్పించనున్నారు.

రెరా గుర్తింపు వల్ల లబ్ధిదారులకు మరో ప్రయోజనం కూడా కలగనుంది. తమ వాటా సొమ్మును చెల్లించేందుకు అవసరమైన గృహ రుణాలను బ్యాంకుల నుంచి పొందడం మరింత సులభతరం కావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టు వివరాలు అధికారికంగా నమోదు కావడం, ఆస్తి హక్కులకు సంబంధించిన అంశాల్లో స్పష్టత ఉండటం బ్యాంకు రుణాల ప్రక్రియకు ఉపయోగపడనుంది. నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు ఉచిత రిజిస్ట్రేషన్‌తో కూడిన సేల్‌ డీడ్లను అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకం పూర్తిస్థాయిలో అమలైతే హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేని వేలాది పేద కుటుంబాలకు ఆస్తి భద్రతతో కూడిన నివాస సదుపాయం లభించనుంది.

Related News

Latest News