ముదిగంటి విష్ణువర్ధన్‌రెడ్డి జన్మదిన వేడుకలు.. పేద విద్యార్థుల సేవలో ఆయన కృషి అభినందనీయం: వలస సుభాష్ చంద్రబోస్

ప్రతిపక్షం, నవంబర్ 02: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో తెలంగాణ యూత్‌ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముదిగంటి విష్ణువర్ధన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలల హక్కుల ప్రజావేదిక ఆధ్వర్యంలో, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సమన్వయకర్త మెరుగు లక్ష్మి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రస్థాయి సిల్వర్‌ గోల్డ్‌ అవార్డు అందుకున్న ప్రముఖ సంఘ సేవకుడు వలస సుభాష్‌ చంద్రబోస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేక్‌ కట్‌ చేసి ముదిగంటి విష్ణువర్ధన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం వలస సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ముదిగంటి విష్ణువర్ధన్‌రెడ్డి పోషించిన పాత్రను కొనియాడారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా మలిదశ ఉద్యమ సమయంలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా యువత, విద్యార్థులను ఏకం చేసేందుకు కృషి చేశారని తెలిపారు. తెలంగాణ యూత్‌ ఫోరం ఆధ్వర్యంలో ఉమ్మడి పది జిల్లాల్లో యువజన సంఘాలను సమన్వయం చేస్తూ, అన్ని జిల్లా కేంద్రాల్లో వివిధ రాజకీయ పార్టీలతో చర్చావేదికలు నిర్వహించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువతను ముందుండి నడిపించిన నాయకుడిగా విష్ణువర్ధన్‌రెడ్డి సేవలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు.

పేదలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల సంక్షేమం కోసం విష్ణువర్ధన్‌రెడ్డి నిరంతరం ఆలోచిస్తుంటారని సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతూ పేద విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. దేశం తనకేమిచ్చిందనే ఆలోచన కంటే దేశానికి తానేమి చేయగలననే తపనతో పనిచేసే వ్యక్తి విష్ణువర్ధన్‌రెడ్డి అని ప్రశంసించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల పట్ల ఆయనకు ఉన్న ఆసక్తి, సేవాభావం మరింత మందికి స్ఫూర్తినిస్తాయని అన్నారు.

రానున్న రోజుల్లో బాలల హక్కుల ప్రజావేదిక ఆధ్వర్యంలో చేపట్టబోయే సామాజిక సేవా కార్యక్రమాలకు ముదిగంటి విష్ణువర్ధన్‌రెడ్డి సూచనలు, సహకారం ఎంతో అవసరమని సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, పేద విద్యార్థులకు సహాయం అందించడం వంటి అంశాలపై మరింత విస్తృతంగా పనిచేయాలని తమ సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు విష్ణువర్ధన్‌రెడ్డి సహాయ సహకారాలు తీసుకుంటామని చెప్పారు.

విష్ణువర్ధన్‌రెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, సమాజ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని సుభాష్‌ చంద్రబోస్‌ ఆకాంక్షించారు. ఆయన జీవితంలో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్‌ బుజ్జ ఎల్లయ్య, మధు, ఆశ్రమ నిర్వాహకులు, వృద్ధులు తదితరులు పాల్గొని విష్ణువర్ధన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Related News

Latest News