పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండ
ఎమ్మెల్యే చొరవతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా
ప్రతిపక్షం ప్రతినిధి, ఖానాపూర్ 24: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని 7వ వార్డు కౌన్సిలర్ నిమ్మల రమేష్ అన్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నిమ్మల రమేష్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందేలా చొరవ చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, వార్డు అభివృద్ధి సభ్యులు ఉషాకోల సుధాకర్, లింగాల రాములు,రాం భీమన్న, లింగాల లక్ష్మణ్, దుర్గం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


























