•ఎమ్మెల్సీ అభ్యర్థులందరికీ ఆకాష్ కొల్లూరు బహిరంగ సవాల్
•పట్టభద్రుల గొంతుకగా చట్టసభలో అడుగుపెడతా
•సామాజిక న్యాయమే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా
వనపర్తి ప్రతినిధి, నవంబర్ 24(ప్రతినిధి): ఎన్నికలంటే డబ్బు, ప్రలోభాలు కాదు.. ప్రజా సమస్యలపై పోరాటం కావాలి. పట్టభద్రుల ఓటు సమాజ మార్పుకు ఆయుధం కావాలని..డబ్బుతో ఓట్లు కొనడానికి కాదు.. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాడటానికే ఎన్నికల బరిలోకి వచ్చానని హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ రక్షణ సేన నాయకుడు ఆకాష్ కొల్లూరు స్పష్టం చేశారు.వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మహిళలు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ తన ఎన్నికల అజెండాను వెల్లడించారు.
జూరాల నీళ్ల కోసం రైతుల ఎదురుచూపులు
జిల్లాలో రైతులు సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆకాష్ పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు పరిధిలో కాలువల ద్వారా నీటి పంపిణీ, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, పంట నష్టాలు రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయని అన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, సాగునీరు, గిట్టుబాటు ధరలు, పంట నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి
వనపర్తి పట్టణంలో రహదారి విస్తరణ, డ్రైనేజీ పనుల కారణంగా ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరారు.అర్హులైన కుటుంబాలకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రత్యామ్నాయ గృహాలు లేదా భూమి కేటాయించాలని అన్నారు.
డిగ్రీలు చేతిలో.. ఉద్యోగాలు ఎక్కడ?
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా, నిర్దిష్ట కాలపరిమితిలో చేపట్టాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ భద్రత సమస్యలను చట్టసభలో ప్రస్తావిస్తానని తెలిపారు.
జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై పోరాటం
జర్నలిస్టుగా దశాబ్ద కాలంలో 15కు పైగా పరిశోధనాత్మక కథనాలను వెలుగులోకి తీసుకొచ్చానని ఆకాష్ వెల్లడించారు. ప్రజా సమస్యలు, అవినీతి, అక్రమాలపై కథనాల ద్వారా ప్రశ్నిస్తూ బాధితుల తరఫున నిలిచానని పేర్కొన్నారు. తన పరిశోధనాత్మక కథనాల్లోని అంశాలను సీబీఐ సైతం సుప్రీంకోర్టు విచారణలో ఉపయోగించిన సందర్భాలున్నాయని ఆయన తెలిపారు. ఇన్నాళ్లూ మీడియా ద్వారా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చానని, ఇకపై చట్టసభలో ప్రజల గొంతుకగా మారాలన్న లక్ష్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వివరించారు.
అభ్యర్థులందరికీ బహిరంగ సవాల్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ప్రజలకు చేసిన సేవలు, భవిష్యత్తు కార్యాచరణపై బహిరంగ చర్చకు రావాలని ఆకాష్ కొల్లూరు సవాల్ విసిరారు. డబ్బు, ప్రలోభాల రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యలే ఎన్నికల ఎజెండాగా మారాలని అన్నారు. పదవి కోసం కాకుండా ప్రజల హక్కుల కోసం పోరాడటమే తన లక్ష్యమని, హామీలతో కాకుండా ఆచరణతో ప్రజల నమ్మకాన్ని పొందుతానని ఆకాష్ కొల్లూరు స్పష్టం చేశారు.


























