సంక్షేమ వసతి గృహాల్లో కేంద్రీకృత కొనుగోళ్ల విధానం రద్దు చేయాలి
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ మెదక్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలను ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్రీకృత కొనుగోళ్ల విధానం విద్యార్థుల సంక్షేమానికి విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. గతంలో మాదిరిగా వసతి గృహాల వార్డెన్లు, స్థానిక అధికారులు సరుకుల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేసే విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు నమోదు కోసం అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) విధానం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందని విమర్శించారు. అవసరమైన సాంకేతిక సదుపాయాలు కల్పించకుండా ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందని, వెంటనే ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అద్దె భవనాలకు బదులు సొంత భవనాలు నిర్మించాలి
రాష్ట్రంలోని అనేక సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, అక్కడ సరైన మరుగుదొడ్లు, తాగునీరు, భద్రత, ఇతర మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి వసతి గృహానికి సొంత భవనాలు నిర్మించి, విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్రీకృత కొనుగోళ్ల విధానాన్ని రద్దు చేయాలని, స్థానిక కొనుగోళ్ల విధానాన్ని పునరుద్ధరించాలని, ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ అధ్యక్ష, కార్యదర్శులు సిద్ధు, రాకేష్తో పాటు చరణ్, విజయ్, ముకేష్, అనిల్, రోహిత్, శివ, శ్రీనివాస్, నరేందర్, జస్వంత్, సురేష్, మహేందర్, భాను ప్రసాద్, శివాజీ, దీపిక, భోలి, చిట్టి, మీనాక్షి, నందిని, రాజకుమారి, అర్చన, మౌనిక, హారిక, మేఘన, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.


























