- తెలంగాణలో రామరాజ్యం స్థాపనే బీజేపీ లక్ష్యం
- ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు
- రేవంత్ రెడ్డి 90 సీట్ల వ్యాఖ్యలు హాస్యాస్పదం
- మహా పాదయాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వ్యాఖ్యలు
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, నవంబర్ 23: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాకతో కరీంనగర్ గడ్డ పులకించిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో రామరాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను అమలు చేసి తీరుతామని, ఈ ప్రక్రియను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ పూర్తయ్యే వరకు బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు.కరీంనగర్లో నిర్వహించిన మహా పాదయాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశంలో మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో 90 స్థానాలు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని, రానున్న రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మహా పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉంది: నితిన్ నబిన్
కరీంనగర్ మహా పాదయాత్రలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి ఓటర్ల జాబితాలో పారదర్శకత తీసుకురావడం, అక్రమ ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా సుమారు మూడు కోట్లకు పైగా ఓట్ల తొలగింపు అంశంపై రాహుల్ గాంధీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మరణించిన వారి పేర్లతో, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లతో, ఇతర ప్రాంతాలకు చెందిన ఓట్లతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరగకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అక్రమాలను పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసి నిజమైన ఓటర్లకు న్యాయం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
- మోదీ పాలనపై ప్రజల్లో విశ్వాసం –
ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై దేశ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని నితిన్ నబిన్ పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు అన్ని వర్గాల ప్రజలు మోదీ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. దేశాభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు.రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ మరింత బలోపేతం కావడంతో పాటు తెలంగాణలోనూ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో రామరాజ్య స్థాపన, ప్రజా సంక్షేమం, అవినీతి రహిత పాలన లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.కరీంనగర్ మహా పాదయాత్రకు బీజేపీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావడంతో నగరంలో రాజకీయ సందడి నెలకొంది.



























