మెట్రో దిగగానే గమ్యస్థానానికి చేరేలా.. హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీలకు వేగంగా అడుగులు!

ప్రతిపక్షం, నవంబర్ 24: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు మెట్రో ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ప్రతిపాదించిన పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్‌టీఎస్‌) ప్రాజెక్టు పనులు వేగవంతమవుతున్నాయి. మెట్రో రైలు దిగిన వెంటనే ప్రయాణికులు తమ కార్యాలయాలు, నివాస ప్రాంతాలకు నేరుగా చేరుకునేలా పాడ్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎంపిక చేసిన మార్గాలపై ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనం కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో ఈ నివేదిక అందే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. నివేదిక అందిన తర్వాత ప్రాజెక్టు వ్యయాలు, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం, అవసరమైన భూముల వివరాలను పరిశీలించి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు డిసెంబర్‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో (పీపీపీ) చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ముందుగా ఆర్థికంగా ఎంతవరకు సాధ్యమవుతుందో అంచనా వేయాల్సి ఉంది. ఎంపిక చేసిన మార్గాల్లో జనాభా ఎంత ఉంది? ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ట్రాఫిక్ రద్దీ ఏ స్థాయిలో ఉంది? ఈ రవాణా వ్యవస్థ ద్వారా ఎంతమంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలపై ఇప్పటికే అధ్యయనాలు నిర్వహించారు. ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక వచ్చిన తర్వాత ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధులు, ప్రభుత్వ సహకారం, అదనపు భూముల అవసరం వంటి అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. ప్రభుత్వం ఎంత మేరకు ఆర్థిక సహాయం అందించాల్సి ఉంటుందనే దానిపై స్పష్టత వచ్చిన తర్వాతే టెండర్ల ప్రక్రియ ముందుకు వెళ్లనుంది.

హైదరాబాద్‌లో పీఆర్‌టీఎస్‌ మొదటి దశను ఐటీ కారిడార్‌లో చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. కూకట్‌పల్లి నుంచి రాయదుర్గం, బయోడైవర్సిటీ మీదుగా నాలెడ్జ్ సిటీ వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఐటీ ఉద్యోగులు, మెట్రో ప్రయాణికులకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మొదటి దశలో ఎదురయ్యే అనుభవాలు, ప్రయాణికుల స్పందన, నిర్వహణ సామర్థ్యాన్ని పరిశీలించిన తర్వాత రెండో దశలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి విస్తరించే అంశాన్ని పరిశీలించనున్నారు. తద్వారా మెట్రో స్టేషన్ల నుంచి కార్యాలయాలు, ఇతర ప్రధాన ప్రాంతాలకు చివరి దశ ప్రయాణాన్ని సులభతరం చేయాలన్నది ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

పీఆర్‌టీఎస్‌ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల్లో వేర్వేరు సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ ప్రాజెక్టుకు సంబంధించి ఏ సాంకేతికతను వినియోగించాలనే నిర్ణయాన్ని టెండర్లలో పాల్గొనే సంస్థలకే వదిలేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా సంస్థలు తమ ప్రతిపాదనల్లో ఉపయోగించబోయే సాంకేతికత, నిర్మాణ విధానం, నిర్వహణ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. అయితే ప్రయాణికుల భద్రత, వ్యవస్థ పనితీరు, సాంకేతిక విశ్వసనీయత వంటి అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న పాడ్ ట్యాక్సీ విధానాలపై ఇప్పటికే అధ్యయనాలు చేసినట్లు సమాచారం.

అమెరికాలోని వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ పరిధిలో ప్రత్యేక కాంక్రీట్ గైడ్‌వేలపై నడిచే రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంది. నెదర్లాండ్స్‌లోని రివియం బిజినెస్ పార్క్‌లో రోడ్లకు అనుసంధానమైన ఆటోమేటెడ్ పార్క్ షటిల్ వాహనాలు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. లండన్ హీత్రూ విమానాశ్రయంలో వివిధ టెర్మినళ్ల మధ్య ప్రయాణికులను చేరవేసేందుకు పాడ్ ట్యాక్సీలను ఉపయోగిస్తున్నారు. దక్షిణ కొరియాలోని సుంచెన్ బే పర్యాటక ప్రాంతంలో ఎలివేటెడ్ ట్రాక్‌లపై పాడ్ కార్లు నడుస్తున్నాయి. చైనాలోని నాంటాంగ్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ప్రత్యేక ట్రాక్‌లకు వేలాడుతూ ప్రయాణించే క్యాబిన్లతో కూడిన వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. ఇలాంటి అంతర్జాతీయ నమూనాలను పరిశీలించి హైదరాబాద్‌కు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంపిక చేయనున్నారు.

పీఆర్‌టీఎస్‌ అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యకు కొంతమేర పరిష్కారం లభించడంతో పాటు మెట్రో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపడే అవకాశం ఉంది. ప్రస్తుతం మెట్రో స్టేషన్‌లో దిగిన తర్వాత కార్యాలయాలకు లేదా ఇళ్లకు చేరుకోవడానికి ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర రవాణా మార్గాలపై ఆధారపడుతున్నారు. పాడ్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే ప్రత్యేక ట్రాక్‌లపై ప్రయాణిస్తూ నేరుగా గమ్యస్థానాలకు చేరుకునే సౌకర్యం కలగనుంది. ఇవి రోడ్లపై కాకుండా ప్రత్యేకంగా నిర్మించిన ఎలివేటెడ్ ట్రాక్‌లపై ప్రయాణించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో సాధారణ రహదారులపై ట్రాఫిక్ రద్దీతో సంబంధం లేకుండా ప్రయాణించే అవకాశం ఉంటుంది. పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడంలోనూ ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక కోసం ఎదురుచూస్తుండగా, అది అందిన తర్వాత డిసెంబర్‌లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందా అనే దానిపై స్పష్టత రానుంది.

Related News

Latest News