రాజకీయ విమర్శలతో మెదక్ అభివృద్ధిని అడ్డుకోలేరు

ఎమ్మెల్యే సహకారంతో పట్టణానికి నూతన రూపురేఖలు

విమర్శలు చేసే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ కె. రాధిక భూపతి రాజు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 24: మెదక్ జిల్లా కేంద్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు తెలిపారు. పట్టణ అభివృద్ధి పనులపై కొందరు చేస్తున్న రాజకీయ విమర్శలు సరికాదని గతంలో చేసిన పాలకులు అభివృద్ధి విషయంలో ఆత్మ విమర్శన చేసుకోవాలని ఆమె అన్నారు ఎమ్మెల్యే మెదక్ జిల్లా కేంద్రంలో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడం, సుందరీకరణ చేపట్టడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని సూచించారు.

రాందాస్ చౌరస్తా పనులపై అసత్య ప్రచారాలు సరికాదు

రాందాస్ చౌరస్తా వద్ద చేపడుతున్న సుందరీకరణ పనులపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. అక్కడ ఏర్పాటు చేస్తున్నవి పదునైన మేకులు కావని, చౌరస్తా అభివృద్ధి డిజైన్‌లో భాగంగా నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు చేపడుతున్న ఏర్పాట్లని వివరించారు. అభివృద్ధి పనులు పూర్తికాకముందే తప్పుడు ప్రచారాలు చేయడం, ప్రజల్లో అనవసర ఆందోళన కలిగించడం సరికాదన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. గతంలో మెదక్ మున్సిపాలిటీకి రాజకీయంగా ప్రాతినిధ్యం వహించే అవకాశాలు పొందిన వారు తమ హయాంలో పట్టణ అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలకు వివరించాలని రాధిక భూపతి రాజు అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై విమర్శలు చేసే ముందు గతంలో తమకు లభించిన అవకాశాలను ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.నిర్మాణాత్మక సూచనలను ఎప్పుడూ స్వాగతిస్తామని, అయితే వాస్తవాలకు విరుద్ధంగా చేసే విమర్శలను అంగీకరించబోమని ఆమె తెలిపారు.

  • మెదక్ పట్టణ అభివృద్ధే మా లక్ష్యం

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మార్గదర్శకత్వంలో మున్సిపల్ పాలకవర్గం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని, రాజకీయ విమర్శల కారణంగా ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధి లక్ష్యాల నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విమర్శలకు విమర్శలతో కాకుండా అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతామని మున్సిపల్ చైర్‌పర్సన్ కె. రాధిక భూపతి రాజు స్పష్టం చేశారు.

Related News

Latest News