బతుకమ్మకు చిలకపచ్చ మెరుపు!
అక్కా చెల్లెళ్లకు బతుకమ్మ కానుక
కోటి మందికి.. కోటి చీరలు!
బతుకమ్మ చీరలు వచ్చేశాయ్!
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ , అక్టోబర్ 8: బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటి చీరలను కానుకగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ ఏడాది మహిళలకు చిలకపచ్చ రంగులో ప్రత్యేకంగా రూపొందించిన చీరలను పంపిణీ చేయనున్నారు. పండుగకు ఇంకా 15 రోజుల సమయం ఉండగానే జిల్లాలకు చీరల సరఫరా ప్రారంభమైంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు సగం చీరలు చేరుకోగా.. మిగిలిన చీరలను కూడా త్వరితగతిన పంపించేలా అధికారులు చర్యలు చేపట్టారు.బతుకమ్మ పండుగలో ప్రధానమైన సద్దుల బతుకమ్మకు రెండు రోజుల ముందుగానే మహిళలకు చీరలను పంపిణీ చేసేలా జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకోసం జిల్లాల వారీగా చీరల నిల్వ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. పండుగ సమయానికి మహిళలందరికీ చీరలు అందేలా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో బతుకమ్మ చీరలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలోని మరమగ్గాల సొసైటీలకు ప్రభుత్వం భారీగా ఉత్పత్తి ఆర్డర్లు అందించింది. జిల్లాలోని 130 మరమగ్గాల సొసైటీల ద్వారా కోటి చీరల ఉత్పత్తి చేపట్టేందుకు మొత్తం 7 కోట్ల మీటర్ల వస్త్రానికి సంబంధించిన ఆర్డర్లు ఇచ్చారు.బతుకమ్మ చీరల ఉత్పత్తికి సిరిసిల్లకు పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడంతో మరమగ్గాల కార్మికులకు నిరంతర ఉపాధి లభించనుంది. ఈ ఆర్డర్ల ద్వారా సుమారు ఆరు నుంచి ఏడు నెలల పాటు చేనేత, మరమగ్గాల కార్మికులకు పని దొరకనుంది. పండుగ కోసం చీరల తయారీతో పాటు స్థానికంగా వస్త్ర ఉత్పత్తి రంగానికి కూడా ఈ ఆర్డర్లు ఊతమిస్తాయని అధికారులు పేర్కొన్నారు.
చీరల తయారీ నుంచి ప్యాకింగ్, రవాణా వరకు పలు దశల్లో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు చీరలను అందించడంతో పాటు సిరిసిల్ల చేనేత, మరమగ్గాల రంగానికి ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. చీరల తయారీలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్ణీత సమయంలో చీరల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ పూర్తయ్యేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.




























