వాంతులు చేసుకున్నా పట్టించుకోని సిబ్బంది.
కలెక్టర్‌కు తల్లిదండ్రుల ఫిర్యాదు
ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 08: నర్సాపూర్ పట్టణ పరిధిలోని నారాయణపూర్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని దీపకు చెట్ల ఆకులు తినిపించారని ఆరోపిస్తూ ఆమె తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్‌కు ఫిర్యాదు చేశారు.కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తండాకు చెందిన దీప తరగతి గది శుభ్రం చేస్తుండగా స్టూల్ మరో విద్యార్థినికి తగిలిందని, దీనిని కారణంగా చూపి క్లాస్ టీచర్ శ్రీలత పనిష్మెంట్ పేరుతో బయటకు తీసుకెళ్లి చెట్ల ఆకులు తినిపించారని విద్యార్థిని ఆరోపించింది. అనంతరం వాంతులు చేసుకోవడంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.
విద్యార్థిని’ని ఇంటికి తీసుకెళ్లి చికిత్స చేయించిన అనంతరం తల్లిదండ్రులు తిరిగి పాఠశాలకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై టీచర్‌ను ప్రశ్నించగా తమతో అనుచితంగా మాట్లాడారని, ‘‘ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.టీచర్‌పై భయంతో తమ కుమార్తె పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని తండ్రి సంతోష్‌కుమార్ తెలిపారు. పాఠశాలలోని పరిస్థితులను సమగ్రంగా విచారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
































