ప్రతిపక్షం, నవంబర్ 02: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రముఖ సినీనటి, సామాజిక కార్యకర్త మంచు లక్ష్మి తన వంతు కృషి చేస్తున్నారు. ఆమె స్థాపించి నిర్వహిస్తున్న ‘టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను స్మార్ట్ క్లాస్‌రూమ్‌లుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని చౌటకూర్‌లో ఆమె పర్యటించి, స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో కల్పించిన డిజిటల్ సదుపాయాలను పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ తన చిన్ననాటి పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలను స్మార్ట్ క్లాస్‌రూమ్‌లుగా మార్చేందుకు కృషి చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ‘టీచ్ ఫర్ చేంజ్’ ట్రస్ట్ ద్వారా 364కు పైగా పాఠశాలలను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు అవసరమో గుర్తించి, వాటిని అందించేందుకు తమ బృందం పనిచేస్తోందని చెప్పారు. కేవలం తరగతి గదుల్లో డిజిటల్ పరికరాలను ఏర్పాటు చేయడమే కాకుండా, విద్యార్థులకు మెరుగైన అభ్యసన వాతావరణాన్ని కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం అంత సులభమైన విషయం కాదని, అయినప్పటికీ తమకు సాధ్యమైనంత మేరకు పాఠశాలలకు సహాయం అందిస్తూ ముందుకు సాగుతున్నామని మంచు లక్ష్మి వివరించారు. పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లోని పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన చోట చిన్నపాటి సహాయం అందించినా విద్యార్థుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కూడా కార్పొరేట్ పాఠశాలలకు దీటైన విద్యా అవకాశాలు అందుబాటులో ఉండాలని అన్నారు.
విద్యార్థులకు సైన్స్, గణితం వంటి సబ్జెక్టులను బోధించడంతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆంగ్ల ఉచ్చారణపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని మంచు లక్ష్మి పేర్కొన్నారు. సరైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెప్పారు. తాము అందిస్తున్న విద్య, శిక్షణ ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తుపై నమ్మకం పెంచుకొని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, గొప్ప నాయకులుగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
సమాజంలో మంచి సంకల్పంతో ముందుకు వస్తే సహాయం చేసేందుకు అనేక మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తారని మంచు లక్ష్మి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి బాధ్యత ఒక్కరి వల్ల సాధ్యం కాదని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేస్తున్న వాలంటీర్లకు, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గాజుల సుభాష్ బాబు, మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి, సర్పంచ్ పార్కల రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


























