ఫలించిన కూసుకుంట్ల పోరాటం.. కదిలిన అధికార యంత్రాంగం!

*మాజీ ఎమ్మెల్యే హెచ్చరికతో రంగంలోకి దిగిన అధికారులు – తాత్కాలిక రోడ్డు పనులు ప్రారంభం.

*చౌటుప్పల్ ఫ్లైఓవర్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.

ప్రతిపక్షం చౌటుప్పల్ నవంబర్ 03: చౌటుప్పల్ పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా వాహనదారులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన కృషి ఫలించింది.ప్రజల ఇబ్బందులను గుర్తించి నేరుగా రంగంలోకి దిగిన ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపడంతో అధికార యంత్రాంగం స్పందించింది. ఆయన సూచనల మేరకు చౌటుప్పల్‌లో తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులను అధికారులు ఈరోజు ప్రారంభించారు.జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తంగడపల్లి రోడ్డు వైపు వెళ్లే వాహనదారులు వలిగొండ రోడ్డు వైపు వెళ్లి యూటర్న్ తీసుకుని రావాల్సిన దుస్థితి నెలకొంది.

*కూసుకుంట్ల చొరవ..
ఈ సమస్యను గుర్తించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో నేరుగా మాట్లాడి..

  • నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని మినహాయించి రోడ్డుకు ఇరువైపులా తాత్కాలిక రహదారులు ఏర్పాటు చేయాలని,
  • తంగడపల్లి రోడ్డుకు వెళ్లేందుకు వీలుగా యూటర్న్ సౌకర్యం కల్పించాలని సూచించారు.
  • ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.
    దీంతో అధికార యంత్రాంగం స్పందించి ఈరోజు తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది.
    ప్రజల సమస్యే తన సమస్యగా భావించి, మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి అధికారులను కదిలించి పనులు ప్రారంభమయ్యేలా చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చొరవ పట్ల స్థానిక వాహనదారులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Latest News