ప్రతిపక్షం, నవంబర్ 24: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేసి, నిర్ణయించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి, మూసీ నది పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటి కీలక అంశాలపై మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్టు మొదటి దశ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న సీఎం.. ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణ, టెండర్ల ప్రక్రియ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఫేజ్-1లో భాగంగా చేపట్టనున్న పనుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1ఏగా, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1బీగా విభజించి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో ప్రాజెక్టు అమలుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఫేజ్-1 పనులను 2027 జనవరిలో ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎంకు వెల్లడించారు. ఇప్పటికే మొదటి దశకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పనుల ప్రారంభానికి ముందే అవసరమైన అన్ని అంశాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు.
సమీక్షలో మిరాలం చెరువు అభివృద్ధి అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఈ పనులను 2028 జనవరి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు అధికారులు వివరించారు. చెరువు అభివృద్ధితో పాటు అందులో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చెరువు పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రాజెక్టులో భాగంగా చేపట్టే ప్రతి పనిని సమగ్ర ప్రణాళికతో అమలు చేయాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రతిపాదించిన రేడియల్ రోడ్ల నిర్మాణంపైనా సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు. ఆయా రోడ్ల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పురోగతి, ఇతర పనుల స్థితిగతులను అధికారులు వివరించారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో జాప్యం జరగకుండా వేగం పెంచాలని, భూసేకరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనుల పురోగతిని కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మూసీ పునరుజ్జీవం, చెరువుల అభివృద్ధి, రేడియల్ రోడ్లు, పట్టణ మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు హైదరాబాద్ భవిష్యత్తు అభివృద్ధికి కీలకమని సీఎం పేర్కొన్నారు. ఆయా ప్రాజెక్టులన్నింటినీ నిరంతరం పర్యవేక్షిస్తూ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధికి సంబంధించిన ఇతర అంశాలపైనా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌తో పాటు పలు మున్సిపల్ సంస్థల కమిషనర్లు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇతర సంబంధిత సంస్థల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు.


























