ప్రతిపక్షం, నవంబర్ 25: పెరుగుతున్న ధరలు, మారుతున్న జీవనశైలి యువత ప్రేమ వ్యవహారాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు డేటింగ్ అంటే ఖరీదైన రెస్టారెంట్లు, కేఫ్‌లు, సినిమాలు, విహారయాత్రలు గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు పెరిగిన జీవన వ్యయం, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా యువత తమ డేటింగ్ విధానాన్ని మార్చుకుంటోంది. ఆడంబరాలకు దూరంగా ఉంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ సమయం కలిసి గడిపేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో జెన్‌జీ యువతలో ‘ఇన్ఫ్లడేటింగ్’ అనే కొత్త ట్రెండ్ ప్రాచుర్యంలోకి వస్తోంది. ద్రవ్యోల్బణం, డేటింగ్ అనే రెండు పదాల కలయికతో ఏర్పడిన ఈ పదం ప్రస్తుతం యువత మధ్య చర్చనీయాంశంగా మారింది.
ఇన్ఫ్లడేటింగ్ను ‘డేట్ఫ్లేషన్’ అని కూడా పిలుస్తున్నారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో డేటింగ్ కోసం చేసే ఖర్చులను తగ్గించుకుని, తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా కలుసుకోవడమే ఈ ట్రెండ్ ప్రధాన ఉద్దేశం. ప్రేమను వ్యక్తపరచడానికి భారీగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ఖరీదైన బహుమతులు, విలాసవంతమైన రెస్టారెంట్ల కంటే ఇద్దరి మధ్య ఉండే అనుబంధం, పరస్పర అవగాహన ముఖ్యమని యువత భావిస్తోంది. అందుకే డేటింగ్ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది.
ఈ మార్పునకు ప్రధాన కారణం పెరుగుతున్న జీవన వ్యయమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు, జీఎస్టీ, ఇతర పన్నులు, సర్వీస్ ఛార్జీలు పెరగడంతో సాధారణ డిన్నర్ కూడా ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఇద్దరు కలిసి భోజనం చేస్తే బిల్లు రూ.4 వేలకుపైగా రావడం సాధారణమవుతోందని చెబుతున్నారు. ఇక తరచూ ఫస్ట్ డేట్స్‌కు వెళ్లే యువతకు ఈ ఖర్చులు మరింత భారంగా మారుతున్నాయి. ప్రతి పరిచయాన్ని తెలుసుకునేందుకు రెస్టారెంట్లు, కేఫ్‌లకు వెళ్లడం ఆర్థికంగా ఇబ్బందికరంగా మారడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.
సోషల్ మీడియా ప్రభావం కూడా ఈ విషయంలో కీలకంగా మారింది. ఆన్లైన్లో తమ జీవితాన్ని ఆకర్షణీయంగా చూపించుకోవాలనే ఒత్తిడి ఒకవైపు ఉంటే, మరోవైపు రోజువారీ ఖర్చులను నియంత్రించుకోవాల్సిన పరిస్థితి యువతకు ఎదురవుతోంది. ఖరీదైన డేటింగ్లు, బహుమతులు, విలాసవంతమైన ప్రదేశాల్లో కలుసుకోవడం వంటివి సోషల్ మీడియాలో ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, వాస్తవ జీవితంలో వాటిని కొనసాగించడం కష్టమవుతోంది. దీనికి తోడు డేటింగ్ యాప్‌లలో పరిచయమైన వ్యక్తులు అకస్మాత్తుగా మాట్లాడటం మానేయడం వంటి ఘోస్టింగ్ అనుభవాలు కూడా యువతను ఆలోచనలో పడేస్తున్నాయి.
సరైన భాగస్వామిని ఎంచుకునే క్రమంలో అనేకమందిని కలవాల్సి రావడం కూడా ఖర్చులను పెంచుతోంది. ప్రతి ఫస్ట్ డేట్‌కు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చు చేస్తూ వెళ్లడం దీర్ఘకాలంలో సాధ్యం కాదని యువత భావిస్తోంది. అందుకే నిజంగా ఆసక్తి ఉన్న వ్యక్తులతో మాత్రమే కలుసుకోవాలని, ప్రతి సమావేశానికి భారీగా ఖర్చు చేయకుండా ముందుగానే బడ్జెట్ నిర్ణయించుకోవాలని చూస్తోంది. దీనివల్ల అనవసర ఖర్చులు తగ్గడమే కాకుండా, సంబంధాన్ని మరింత అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది.
ఇన్ఫ్లడేటింగ్ ట్రెండ్‌లో భాగంగా యువత తక్కువ ఖర్చుతో కూడిన డేటింగ్ పద్ధతులను అనుసరిస్తోంది. పార్కుల్లో కలిసి నడవడం, స్థానిక స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో ఆహారం తీసుకోవడం, సాధారణ కాఫీ కోసం కలుసుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో కొంత సమయం గడపడం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తోంది. ఖరీదైన రెస్టారెంట్లలో గంటల తరబడి గడపడం కంటే, ప్రశాంతమైన వాతావరణంలో ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. డబ్బు ఖర్చు చేసి ఎదుటివారిని ఆకట్టుకోవాలనే ఒత్తిడికి బదులుగా సహజమైన పరిచయానికి ప్రాధాన్యత ఇస్తోంది.
తక్కువ ఖర్చుతో డేట్‌కు వెళ్లడం అంటే ఎదుటివారిపై శ్రద్ధ తక్కువగా ఉన్నట్లు కాదని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. ఒకరి ఆర్థిక అలవాట్లు, ఖర్చుల విషయంలో ఆలోచనా విధానం, భవిష్యత్తు లక్ష్యాలు మరొకరితో సరిపోతున్నాయా లేదా తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. సంబంధంలో ఆర్థిక విషయాలను దాచిపెట్టకుండా మాట్లాడుకోవడం, ఇద్దరి బడ్జెట్‌కు అనుగుణంగా ప్రణాళికలు వేసుకోవడం ఆరోగ్యకరమైన బంధానికి దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రేమను నిరూపించుకోవడానికి ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదనే ఆలోచన యువతలో పెరుగుతోంది.
అమెరికాలో నిర్వహించిన కొన్ని అధ్యయనాలు కూడా డేటింగ్ ఖర్చుల భారాన్ని స్పష్టం చేస్తున్నాయి. మోర్గాన్ స్టాన్లీ పరిశోధన ప్రకారం, డేటింగ్ యాప్‌ల కోసం డబ్బు చెల్లించే సగటు వినియోగదారు నెలకు సుమారు 19 డాలర్లు, అంటే దాదాపు రూ.1,600 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు, 2,501 మంది అమెరికన్లపై బీఎంఓ ఫైనాన్షియల్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో జెన్‌జీ యువత ఒక్కో డేట్‌కు సగటున 205 డాలర్లు, భారత కరెన్సీలో సుమారు రూ.19,500 వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. మిలీనియల్స్ విషయంలో ఈ మొత్తం 252 డాలర్లు, అంటే దాదాపు రూ.24 వేలుగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.
అయితే డేటింగ్ కోసం ఇంత భారీగా ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితం దక్కడం లేదని చాలామంది భావిస్తున్నారు. ఒంటరిగా ఉన్నవారిలో దాదాపు 47 శాతం మంది డేటింగ్ కోసం చేస్తున్న ఖర్చుకు తగిన విలువ లభించడం లేదని అభిప్రాయపడినట్లు సర్వే వెల్లడించింది. అధిక డేటింగ్ ఖర్చులు తమ భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలకు అడ్డంకిగా మారుతున్నాయని జెన్‌జీలో 48 శాతం మంది, మిలీనియల్స్‌లో 40 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.
మొత్తంగా చూస్తే, ఇన్ఫ్లడేటింగ్ అనేది కేవలం డబ్బు ఆదా చేసే పద్ధతి మాత్రమే కాదు.. ప్రేమ, సంబంధాల విషయంలో యువత ఆలోచనా విధానంలో వస్తున్న మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. ఆడంబరాల కంటే అనుబంధానికి, ఖరీదైన అనుభవాల కంటే కలిసి గడిపే సమయానికి ప్రాధాన్యత ఇస్తోంది. పెరుగుతున్న ధరల మధ్య వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను కాపాడుకుంటూనే ప్రేమ జీవితాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో జెన్‌జీ ఈ కొత్త ట్రెండ్‌ను అనుసరిస్తోంది.


























